మండల వైద్యాధికారి డా. వి. సుధాకర్
విశాలాంధ్ర -పామిడి ( అనంతపురం జిల్లా) : శస్త్రచికిత్సలు,సూది మందు, స్టెరాయిడ్లు,మత్తు మందులు, యాంటిబయాటిక్ లు ఇస్తే చర్యలు తప్పవు అని మండల వైద్య అధికారి డాక్టర్ వి.సుధాకర్ పేర్కొన్నారు. గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… అర్హత లేకుండా ఎవరూ వైద్యం చేయకూడదని వైద్య, ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ప్రథమ చికిత్స చేసే ఆర్ఎంపీలు తమ పేరు ముందు డాక్టర్ అని పెట్టుకోకూడదని ఆదేశించారు. ఆర్ఎంపీలు స్థాయికి మించి వైద్యం చేస్తున్నట్లు అనేక ఆరోపణలు వస్తున్నాయన్నారు. వారి వైద్యం వల్ల కొందరు రోగులు మృతిచెందినట్లు ఫిర్యాదులు వచ్చాయని తెలియజేశారు. ప్రథమ చికిత్స చేసే వ్యక్తులు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నడుచుకోవాలని వైద్య, ఆరోగ్యశాఖ సూచించిందన్నారు. ఆర్ఎంపీలు తమ చికిత్స కేంద్రం ముందు సూచిక బోర్డులపై ఫస్ట్ అయిడ్ సెంటర్ లేదా ప్రథమ చికిత్స కేంద్రం అని మాత్రమే ప్రదర్శించాలన్నారు. క్లినిక్, ఆసుపత్రి, నర్సింగ్ హోం, మెడికల్ సెంటర్ లేదా మరే ఇతర పేర్లతో సూచిక బోర్డులను ప్రదర్శించరాదని పేర్కొన్నారు. పామిడి మండల పరిధిలోని ఎద్దులపల్లి పిహెచ్సి లో మండల వ్యాప్తంగా 37 ఆర్ఎంపి లాకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రథమ చికిత్స చేసే వ్యక్తులు సర్కారు సూచనలను ఉల్లంఘిస్తే కఠినచర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీరామ్ రెడ్డి,సుధాకర్, ఆర్ఎంపీలు నాగ మల్లారెడ్డి, రాము, అంజి నాయక్, తదితరులు పాల్గొన్నారు