విశాలాంధ్ర, కదిరి.కదిరి రూరల్ పరిధిలోని ఎరుకలవాండ్లపల్లి సమీపంలో ఉన్న హరీష్ పాఠశాలలో గురువారం తెలుగు భాష దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ యం.యస్. కిరణ్ మాట్లాడుతూ.. తెలుగు భాష అభివృద్ధి కోసం గిడుగు రామమూర్తి పంతులు విశేషంగా కృషి చేశారన్నారు. ఆయన జన్మదినమైన ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నామని గుర్తుచేశారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు కీర్తించిన భాష తెలుగు అన్నారు. ‘తెలుగు భాష తియ్యదనం.. తెలుగు జాతి గొప్పదనం.. తెలుసుకున్నవాళ్లకి తెలుగే ఒక మూలధనం’ అంటూ సినీ కవులు పొగిడిన భాష మన తెలుగు భాష అని పేర్కొన్నారు. తెలుగు సాహిత్యాన్ని సరళీకరించి, తెలుగు తీయదనాన్ని సామాన్యుడికి చేరువ చేసేందుకు గిడుగు రామ్మూర్తి ఎనలేని కృషి చేశారని, ఆయన అందించిన విశిష్ట సేవలను గుర్తు చేశారు. ఆధునిక తెల తెలుగు భాషకు చాలా ప్రాచీన నేపథ్యం ఉందని, సాహిత్యం, కవిత్వం, సంగీతం ఇలా అన్ని కళల్లోనూ తెలుగు భాషకు ప్రాధాన్యం ఉందన్నారు. దేశంలో హిందీ, బెంగాలీ భాషల తర్వాత దేశంలో అత్యధికులు మాట్లాడుకునే భాష మన తెలుగు భాష అన్నారు. అనంతరం విద్యార్థులు వేమన, సుమతీ శతకాలపై పద్య రచనలు, కవితలు, గేయాలు, నాటకాలు, నృత్యాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.