ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పట్ల ప్రత్యేక చొరవ… బేసిక్ పోలీసింగ్ పై దృష్టి
జిల్లా నూతన ఎస్పీగా శ్రీ పి.జగదీష్ పదవీ బాధ్యతల స్వీకరణ
విశాలాంధ్ర -అనంతపురం : అనంతపురం జిల్లా నూతన ఎస్పీగా పి.జగదీష్ సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని తన ఛేంబర్లో పదవీ బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వ ప్రాధాన్యతలలో ఒకటైన బేసిక్ పోలీసింగ్ లో భాగమైన అంశాలపై దృష్టిపెడతామని ఎస్పీ గారు పేర్కొన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పట్ల ప్రత్యేక చొరవ చూపి ప్రజలకు మరింత సేవలు అందేలా కార్యాచరణ రూపొందిస్తామన్నారు. జిల్లా ప్రశాంతంగా ఉంచేందుకు అన్ని వర్గాల ప్రజలు సహకారం తీసుకుంటామన్నారు. శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పని చేస్తాం. నిష్పక్షపాతంగా, చట్టపరంగా వ్యవహరిస్తామన్నారు. ఎవరైనా విఘాతం కల్గిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని… గంజాయి, సైబర్ నేరాల నియంత్రణలపై చట్టపరమైన గట్టి చర్యలు తీసుకుంటామన్నారు. గంజాయి అక్రమ రవాణాదారులు, విక్రేతలు, వినియోగదారులను గుర్తించి చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తామన్నారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల నియంత్రణపై దృష్టి సారిస్తాం. క్షేత్రస్థాయిలో మహిళా సమస్యలను గుర్తించి తగు పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన వాళ్లకు… వాళ్ల యెడల నేరాలకు పాల్పడిన వాళ్లను కఠినంగా శిక్షించేలా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. జిల్లాలో పని చేస్తున్న హోంగార్డుల నుండీ పోలీసు సిబ్బంది, అధికారులు మరియు వారి కుటుంబాల సంక్షేమం పట్ల ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. పోలీసులకు అవసరమైన సంక్షేమ చర్యలను తీసుకుంటాం. ప్రజలతో మమేకమై మెరుగైన సేవలు అందిస్తూ పోలీసుశాఖ పట్ల విశ్వాసాన్ని, ప్రతిష్టను పెంపొందించేందుకు కృషి చేస్తామన్నారు.