మంత్రి సత్యకుమార్ యాదవ్
విశాలాంధ్ర – అనంతపురం : రైతులను ఆదుకోవడంలో ఉపేక్ష, ఉదాసీనత ఉండరాదని రాష్ట్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం & వైద్య విద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.
అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో గురువారం సాగునీటి సలహా మండలి (ఐఏబీ) సమావేశం నిర్వహించారు. సమావేశంలో రాష్ట్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం & వైద్య విద్య శాఖ మంత్రివర్యులు కుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ హెచ్.ఎల్.సి, హెచ్.ఎన్.ఎస్ఎస్ కింద నీటి నిర్వహణ, కాలువలు, డ్యామ్ ల సామర్థ్యం, అన్నిటిపై అవగాహన కల్పించుకుని నీటిని సద్వినియోగం చేసుకోవాలని, చివరి ఆయకట్టు వరకు నీరు చేరాలన్నారు. రైతులను ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని, చిత్తశుద్ధితో పనిచేసే ప్రభుత్వం తమదని, అధికారులంతా ఉద్యోగ ధర్మం నిర్వహించాలన్నారు. పీఏబీఆర్ నుంచి ధర్మవరంకి నీరు తీసుకెళ్లేందుకు ఉన్న అవకాశాలు పరిశీలించాలన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాకు కేంద్ర ప్రభుత్వ పథకాల కింద ఏ రకంగా లబ్ధి పొందవచ్చు అనేదానిపై సంబంధిత అధికారులు ప్రతిపాదనలు తయారు చేయాలని, సంబంధిత కేంద్ర మంత్రులతో మాట్లాడి ప్రత్యేక నిధులు జిల్లాకు తెచ్చేందుకు తాము బాధ్యత తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అసాధ్యం అనుకున్న పనిని సాధ్యమని భావించి తుంగభద్ర డ్యామ్ గేటును బిగించిన తీరుకు రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఆర్థిక, నీటిపారుదల శాఖ మంత్రులకు, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.*
ఇబ్బందులు లేకుండా నీటి సరఫరాకు చర్యలు : ఐఏబి చైర్ పర్సన్ మరియు జిల్లా కలెక్టర్ & మేజిస్ట్రేట్ డాక్టర్ వినోద్ కుమార్.వి
ఐఏబి చైర్ పర్సన్ మరియు జిల్లా కలెక్టర్ & మేజిస్ట్రేట్ డాక్టర్ వినోద్ కుమార్.వి మాట్లాడుతూ కర్ణాటకలో వర్షాలు బాగా కురవడం వల్ల తుంగభద్ర జలాశయం పర్యవేక్షక ఇంజనీర్ల స్థాయి ప్రథమ సమీక్ష సమావేశం 2024-25 వ ఏడాదికిగాను జూన్ 6వ తేదీన నిర్వహించడం జరిగిందని, తుంగభద్ర ప్రాజెక్టు యొక్క నీటి లభ్యత అనుసరించి వివిధ కాలువలకు నీటి కేటాయింపులు మరియు విడుదల ప్రణాళిక నిర్ణయించడం జరిగిందని, అందులో రమారమి 172 టీఎంసీల నీటి లభ్యత జరిగితే, అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 53.953 టీఎంసీల నీటి కేటాయింపులు జరిగాయన్నారు. అందులో హెచ్.ఎల్.సి సిస్టంకు 26.368 టీఎంసీలు కేటాయించడం జరిగిందన్నారు.
అనంతరం స్వచ్ఛత హి సేవ పోస్టర్లను మంత్రులు ఆవిష్కరించారు. తదనంతరం సిసిఆర్సి కార్డులను రైతులకు మంత్రులు, జిల్లా కలెక్టర్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సమావేశంలో డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి, ప్రాజెక్ట్స్ చీఫ్ ఇంజనీర్ కె.నాగరాజ, కన్వీనర్ మరియు హెచ్.ఎల్.సి ఎస్ఈ రాజశేఖర్, హెచ్.ఎన్.ఎస్.ఎస్ ఎస్ఈ దేశేనాయక్, మైనర్ ఇరిగేషన్ ఎస్ఈ విశ్వనాథరెడ్డి, ఆర్డీవోలు వసంత బాబు, రాణి సుస్మిత, శ్రీనివాసులు రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శిరీష, ఆయా శాఖల ఈఈలు, డిఈలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.