విశాలాంధ్ర, ఉరవకొండ అనంతపురం జిల్లా
ఉరవకొండ పట్టణంలో జిల్లా పరిషత్ సెంట్రల్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న తాటికొండ వెంకట్ జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డుకి ఎంపికయ్యారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం అనంతపురంలో ఏర్పాటుచేసిన ఒక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, ఎంపీ ఎమ్మెల్యేలు చేతుల మీదుగా తాటికొండ వెంకట్ ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డును అందుకున్నారు. అవార్డు రావడం పట్ల ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుడు తాటికొండ వెంకట్ విద్యార్థులను ప్రోత్సహించడానికి అనేక కార్యక్రమాలను నిర్వహించారు. విద్యార్థులలో సృజనాత్మకత ఆలోచనలు వెలికి తీసి వారు ఉన్నత స్థానానికి ఎదిగేలా సిద్ధం చేశారు. పాఠశాల సమయంలోనే కాకుండా అదనపు సమయంలో కూడా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులలో నైపుణ్యాలు విలువలను సామర్థ్యాలను పెంపొందించేందుకు విశేష కృషి చేశారు. అంతేకాకుండా నిస్వార్థ స్వచ్ఛంద సంస్థ ద్వారా ప్రతిభ కలిగిన పేద విద్యార్థుల ప్రోత్సహిస్తూ వారు ఉన్నత స్థానానికి ఎదగడానికి వెంకట్ మానవతా దృక్పథంతో తమ వంతు సహాయ సహకారాలను అందిస్తున్నారు. ఖాళీ సమయాలలో కూడా విద్యార్థులను ప్రోత్సహించడానికి అనేక సేవ కార్యక్రమాలను ఆయన నిర్వహిస్తున్నారు. పాలీసెట్ విద్యార్థులకు ఉచిత శిక్షణ, సూపర్ 60 లాంటి ప్రణాళిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతిభ కలిగిన విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. ఉచితంగా విద్యా వికాస్ శిక్షణ కేంద్రాన్ని నిర్వహించి విద్యార్థులకు మానవతా విలువలు, నీతి కథలు, ఆరోగ్యం, యోగ తదితర అంశాలపై ఆయన నిరంతరం పనిచేస్తున్నారు విద్యతోనే పేదరిక నిర్మూలన జరుగుతుందని గొప్ప ఆశయంతో ఆయన పనిచేస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు పర్యావరణాన్ని పరిరక్షించడానికి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఒక యజ్ఞం లాగా కొనసాగిస్తున్నారు. నిత్యం సేవా కార్యక్రమాలను చేస్తున్న
వెంకట్ లాంటి నిస్వార్థ సేవకుడికి జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు రావడం పట్ల సర్వత్ర హర్షం వ్యక్తమవుతోంది ఆయనకు రాష్ట్ర జాతీయ స్థాయి అవార్డులు కూడా రావాలని విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు, మిత్రులు ఆకాంక్షిస్తున్నారు.