విశాలాంధ్ర -అనంతపురం : విశాఖ ఉక్కు పరిశ్రమను స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో విలీనం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి,రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి,ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు చెన్నప్ప యాదవ్ లు డిమాండ్ చేశారు.
సోమవారం ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో కార్మిక,రైతు జిల్లా సంఘాల సమావేశం నిర్వహించడం జరిగింది, ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమను బిజెపి ప్రభుత్వం అడ్డదారిలో చేస్తున్న ప్రైవేటీకరణను నిలుపుదలచేయాలన్నారు. బిజెపి మూడవసారి అధికారంలోకి వచ్చిన తరువాత ఉక్కు పరిశ్రమ పరిస్థితి చాలా దయనీయంగా మారిందన్నారు. ఉత్పత్తి సామర్ధ్యం తగ్గించి మరింత నష్టాల్లోకి నెట్టివేస్తున్నారన్నారు. కార్పోరేట్ కంపెనీలకు ఉక్కు పరిశ్రమను దారాదత్తం చేస్తూ వేలాది మంది కార్మికులను రోడ్డుపాలు చేయడమే బిజెపి లక్ష్యమన్నారు. ఉక్కు పరిశ్రమకు సొంత గనులు కేటాయించాలన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను “స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్” లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం జిల్లా వ్యాప్తంగా జరగబోయే రాస్తారోకోలను జయప్రదం చేయాలన్నారు.
ఈ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు రాజేష్ గౌడ్,నగర ప్రధాన కార్యదర్శి కృష్ణుడు,నగర అధ్యక్షులు చిరంజీవి,రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వన్నారెడ్డి,జిల్లా నాయకులు మధు తదితరులు పాల్గొన్నారు.