ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిరుతల మల్లికార్జున
విశాలాంధ్ర – అనంతపురం : ఆంధ్రప్రదేశ్ రైతు సంఘము రాష్ట్ర సమితి పిలుపు లో భాగంగా కృష్ణా,గోదావరి నదీ జలాల పునః పంపిణీ ద్వారా మన రాష్ట్ర నీటి హక్కులను కాపాడాలని కోరుతూ ఈ రోజు అనంతపురం కలెక్టర్ కార్యాలయం ముందర రైతుసంఘము జిల్లా ఉపాధ్యక్షులు పి . రామకృష్ణ అధ్యక్షతన ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం కి ముఖ్య అతిధిగా రైతు సంఘము జిల్లా ప్రధాన కార్యదర్శి చిరుతల మల్లికార్జున హాజరయ్యి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 మరియు గత ట్రిబ్యునల్ వారి తుది ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఏ విధమైన అనుమతులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న మరియు నిర్మించాలని తలపెట్టిన ప్రాజెక్టులు ముఖ్యంగా పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, దిండి ప్రాజెక్టు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం- పేస్ 2 తదితర ప్రాజెక్టుల నిర్మాణం వలన దిగువ రాష్ట్రమైన మన ఆంధ్రప్రదేశ్ కు జరిగే నష్టాలను ట్రిబ్యునల్ దృష్టికి తీసుకు వెళ్ళాలని విజ్ఞప్తి చేశారు.
శ్రీశైలం ప్రాజెక్టు దిగువన నాగార్జునసాగర్ ఎడమ కాలువ నుండి తెలంగాణా 99 టి.యం.సిల నీటిని,మరియు ఆంధ్రప్రదేశ్ 33 టి.యం.సిల నీటిని వినియోగించుకోవాల్సి ఉన్నప్పటికీ మన రాష్ట్రానికి రావాల్సిన 33 టి.యం.సిల నీరు రాకపోవటం వలన 3,4 జోన్లకు ఏ సంవత్సరంలో కూడా నీరు అందని పరిస్థితి ఏర్పడుతుందని దీనివల్ల రైతాంగం నష్టపోతున్నారనే విషయాన్ని నివేదించాలని కోరారు. ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర,కర్ణాటక, మరియు తెలంగాణ రాష్ట్రాలు వర్షపు నీటిని నిలువ చేసుకోవడం వలన మన రాష్ట్రానికి సకాలంలో నీరు లభించని పరిస్థితి ఏర్పడి తాగునీటికి, సాగునీటికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్న అంశాన్ని కూడా ట్రిబ్యునల్ కు నివేదించాలాని విన్నవించారు.
గోదావరి నది నీటి పంపిణీ విషయం చర్చించేందుకు ఉభయ రాష్ట్రాల మధ్య ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కోరారు. ప్రతి సంవత్సరం పులిచింతల ప్రాజెక్టులో 30.23 టి.యం.సి ల నీరు నిలువ ఉండేలా నిర్ణయించి అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఏడాది కృష్ణా డెల్టాకు జూన్ నెల మొదటి వారంలో నారుమళ్లు పెంచుకోవడానికి నీటిని విడుదల చేసి డెల్టాలోని కాలువలకు నీరు అందించే విధంగా విధివిధానాలను రూపొందించాలని కోరారు. డెల్టా ప్రాంతంలోని సుమారు 70 లక్షల మంది ప్రజల తాగునీటి అవసరాలకు మార్చి నుండి జూన్ వరకు నాగర్జున సాగర్ నుంచి నీటిని విడుదల చేసే ఏర్పాటు చేయాలని,నాగర్జున సాగర్ మరియు పులిచింతల ప్రాజెక్టులలో విద్యుత్ ఉత్పత్తిని, వ్యవసాయ ,సాగునీటి అవసరాలను బట్టి అనుసంధానించాలని, ప్రతి సంవత్సరం మార్చి నుండి జూన్ నెల వరకు విద్యుత్ ఉత్పత్తి నిలుపుదల చేయాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవ తీసుకొని పై అంశాలను చర్చించేందుకు రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు,సాగునీటి రంగనిపుణలతో సమావేశం నిర్వహిం చాలని కోరారు… అనంతరం ఈ కార్యక్రమం లో భాగంగా జిల్లా రెవిన్యూ అధికారి రామకృష్ణా రెడ్డికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘము ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది.. ఈ వినతిపత్రం ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు కి పంపించి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు నివేదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బండి రామకృష్ణ,టి.నారాయణస్వామి, కార్యదర్శులు సనప రామకృష్ణ, చలపతి,రమేష్, నరేష్, నగేష్, గోపాల్, మన్నీల వెంకట రాముడు,ఏఐవైఎఫ్ నాయకులు రాకెట్ల రాము,ధనుంజయ, మహిళా సంఘము జిల్లా నాయకురాలు పార్వతీ ప్రసాద్,కౌలు రైతు సంఘం నాయకులు రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.