మంత్రి పయ్యావుల కేశవ్
విశాలాంధ్ర -అనంతపురం : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలో కొత్తగా ఏర్పడిన తమ ప్రభుత్వం గత ఐదేళ్లుగా ఆగిపోయిన హంద్రీనీవా కాలువ పనులు తిరిగి చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించడం జరుగుతోందని రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. శుక్రవారం అనంతపురం నగరంలోని ఆర్.అండ్.బి అతిథి గృహంలో హంద్రీనీవా కాలువ పనులపై హెచ్.ఎన్.ఎస్.ఎస్ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. హెచ్.ఎన్.ఎస్.ఎస్ కింద తొలి దశలో జిల్లాలో ఉరవకొండ వరకు ఉన్న మెయిన్ కెనాల్ ను విస్తరించడం, దాని తర్వాత హోతూరు, చాబాలా కెనాల్ ను పునరుద్ధరించడం, అనంతరం కింద ఉన్నటువంటి చీకుదుర్తి, లత్తవరం కెనాల్, వ్యాసాపురం, రేణుమాకులపల్లి వరకు ప్రతి కెనాల్ ని పునరుద్ధరించుకుంటూ రావడం చేపడతామన్నారు. జిల్లాలోని జీడిపల్లి వరకు కూడా 3,850 క్యూసెక్కుల వరకు నీటిని తీసుకెళ్లే సామర్థ్యాన్ని పెంచేలా, ఆగిపోయిన కెనాల్ వెడల్పు చేసే కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసేందుకు ప్రాథమిక ప్రణాళికలు రూపొందించుకుంటున్నామన్నారు. ఆ తరువాత రెండవ దశలో జిల్లాకు ఉత్తర ప్రాంతానికి సంబంధించి మడకశిర బ్రాంచ్ కెనాల్ కి నీరు ఎలా తీసుకెళ్లాలి, భైరవానితిప్ప, అప్పర్ పెన్నార్ ప్రాజెక్టుకు నీళ్లు ఎలా తీసుకెళ్లాలి అనేదానిపై కార్యచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవడం జరుగుతోందన్నారు. సాధ్యమైనంత తొందరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయం తీసుకెళ్తామని, ఇందుకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చే ఆదేశాలు, సూచనలు తీసుకున్న తర్వాత జిల్లాకు సంబంధించి పకడ్బందీ ప్రణాళిక తయారు చేస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో హెచ్.ఎన్.ఎస్.ఎస్ ఎస్ఈ దేశే నాయక్, తదితరులు పాల్గొన్నారు.