మంత్రి పేర్ని నాని
సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సమావేశం అనంతరం రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను మంత్రి పేర్ని నాని మీడియాకు వెల్లడిరచారు. అమ్మఒడి పథకానికి 75 శాతం హాజరు తప్పనిసరి అని తెలిపారు. అర్హత ఉన్నవారందరికీ సంక్షేమపథకాలు అందిస్తాం అని తెలిపారు. అంతేకాక బీసీ జనగణన చేసేలా అసెంబ్లీలో తీర్మానానికి కేబినెట్ ఆమోదం తెలిపామన్నారు. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపాలని నిర్ణయించామన్నారు. 1947 తర్వాత కుల ప్రాతిపదికన జనగణన జరగలేదు అని మంత్రి పేర్ని నాని తెలిపారు.
ఏపీలో కేసీఆర్ పార్టీ పెట్టాలని మేమూ కోరుకుంటున్నాం..
ఏపీలో పార్టీ పెడతానన్న తెలంగాణ సీఎం కేసీఆర్ కామెంట్లపై మంత్రి పేర్ని నాని మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్ పార్టీ పెట్టాలని మేమూ కోరుకుంటున్నాం. రెండు రాష్ట్రాలు కలిసిపోతే ఆయన బేషుగ్గా పోటీ చెయ్యొచ్చు అని అన్నారు. ఏపీలో పార్టీ పెట్టే ముందు తెలంగాణ కేబినెట్‌లో తీర్మానం పెడితే బాగుంటుందని ఆయన సూచించారు. ఏపీ, తెలంగాణలు ఒకటే రాష్ట్రంగా ఉండాలని జగన్ గతంలోనే కోరుకున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ పథకాలపై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దగ్గర మైక్ పెడితే బాగా చెప్తారని మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేసారు.