. మామూళ్ల మత్తులో అధికారులు
. టన్నుల కొద్దీ తరలించుకుపోతున్న అక్రమార్కులు
. వాల్టా చట్టానికి తూట్లు… దర్జాగా సరిహద్దులు దాటుతున్న వైనం
. పాలకులు ఎందుకు పట్టించుకోవడం లేదని ఆదివాసీల నిలదీత
విశాలాంధ్ర-అరకులోయ: అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యంలోని డుంబ్రిగుడ, అనంతగిరి మండలాల్లో అడ్డు అదుపు లేకుండా ఇసుక అక్రమ రవాణా యథేచ్చగా జరుగుతోంది. కొందరు రాజకీయ నేతల అండదండలతో అక్రమార్కులు దర్జాగా ఇసుకను అక్రమ రవాణా చేస్తూ కోట్లకు పడగలెత్తుతున్నారు. వాస్తవానికి అరకులోయ, డుంబ్రిగుడ, అనంతగిరి మండలాల్లో ప్రభుత్వపరంగా ఎటువంటి ఇసుక రీచ్‌లు లేవు. అయితే ప్రభుత్వ అనుమతులతో అధికారికంగా నిర్మించే భవనాలకు మాత్రం ఇసుక సరఫరా చేసే విధానం అమలులో ఉంది. ప్రైవేటు ఇతరత్రా నిర్మాణాలకు ఇసుక సరఫరా చేయాలంటే రెవెన్యూ, పంచాయతీ అధికారుల అనుమతులు తప్పనిసరి. అయితే ఆయా మండలాల్లో మాత్రం ఇసుక అక్రమార్కులు ఇవేమీ పట్టించుకోకుండా ధనార్జనే ధ్యేయంగా పెట్టుకొని ఇష్టారాజ్యంగా తరలించకపోతున్నారు. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయవలసిన అధికారులు కమీషన్ల మత్తులో మునిగి తేలుతున్నారని గిరిజనులు ఆరోపిస్తున్నారు.
డుంబ్రిగుడ మండలం గోరాపూర్, కురిడి గడ్డ, అనంతగిరి మండలం కాశీపట్నం, గరుగుబల్లి, జిలుగులపాడు, వెంకయ్యపాలెం పరిసర ప్రాంతాల నుంచి ప్రతిరోజు వందలాది లారీలలో ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. ఇంత జరుగుతున్నా పాలకులు, అధికారులు ఎందుకు మౌనంగా ఉండి పోతున్నారని ఆదివాసీలు ప్రశ్నిస్తున్నారు. ఒకపక్క ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా ఇసుక సరఫరా చేస్తున్నామని చెబుతుండగా… ఇక్కడ అధికారికంగా అనుమతులు లేకపోయినా అక్రమార్కులు లారీ, వ్యాన్ లోడులకు వేలాది రూపాయలు వసూలు చేస్తూ ప్రజలను దోపిడీకి గురి చేస్తున్నారని మండిపడుతున్నారు. దర్జాగా అక్రమ రవాణా జరుగుతున్నప్పటికీ కూటమి ప్రభుత్వ పాలకులకు, అధికారులకు ఎందుకు పట్టడం లేదని గిరిజనులు నిలదీస్తున్నారు. వాల్టా చట్టానికి వ్యతిరేకంగా గెడ్డలను గుట్టలుగా మారుస్తుండడం వల్ల భవిష్యత్తులో గోరపూర్ ఇతర ప్రాంతాలలో కూడా తీవ్ర మంచినీటి ఎద్దడి నెలకొనే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గోరపూర్‌గడ్డ ప్రధాన మార్గంలో ఇసుక అక్రమ తవ్వకాలతో పెద్ద పెద్ద గోతులు ఏర్పడుతున్నాయని వీటి వలన అనేకమంది మృత్యువాత పడే ప్రమాదం ఉందని ఆదివాసీలు భయాందోళన చెందుతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నతాధికారులు ఇసుక అక్రమ రవాణాపై దృష్టి సారించకపోవడం, అక్రమార్కులు … పాలకులు, అధికారులను తప్పుదోవ పట్టించడం వల్లనే యథేచ్చగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని అంటున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసి అక్రమార్కులపై కేసులు పెట్టాలని గిరిజన సంఘాల నేతలు, ప్రజా సంఘాల ప్రతినిధులు, స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయని పక్షంలో డుంబ్రిగూడ మన్యం మరో రాజస్థాన్ ఎడారిగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.