. పట్టాభూముల నుంచి సేకరణపై త్వరలో జీవో
. కలెక్టర్లతో గనులశాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : పట్టా భూముల నుంచి ఇసుక సేకరణ అనుమతులపై త్వరలో జీఓ ఇవ్వనున్నామని, రవాణా చార్జీలు మినహాయించి రాష్ట్ర వ్యాప్తంగా ఏకీకృత ధర అమలులో ఉండేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని గనులశాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో శుక్రవారం కలెక్టర్లతో… ఉచిత ఇసుక విధానం, సెప్టెంబరు 11 తేదీ నుంచి అమలుకానున్న నూతన విధానాలపై సచివాలయం నుంచి ఆయన వీడియో కాన్సరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఉచిత ఇసుక పంపిణీలో రోజువారీ సమీక్షలతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. వర్షాకాలం ప్రత్యేక శ్రద్ధ్ద తీసుకోవాలన్నారు. రాష్ట్రస్థాయి కమాండ్ కంట్రోల్ సెంటర్ తరహాలోనే జిల్లాస్థాయిలో కూడా ఆయా కేంద్రాలను తక్షణమే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎటువంటి రాజకీయ వత్తిడులకు లోనుకావద్దని, ఇదే విషయాన్ని సీఎం చాలా స్పష్టంగా చెప్పారని తెలిపారు. అన్‌లైన్ ద్వారా తమ ఇంటి నుంచే ఇసుక బుక్ చేసుకుని జీపీిఎస్ విధానంలో తమ వాహనం లోకేషన్‌ను కూడా తెలుసుకోవచ్చన్నారు. అవగాహన లేని వారి కోసం సచివాలయంలో శిక్షణ పొందిన ఉద్యోగి అందుబాటులో ఉంటారన్నారు.కలెక్టర్లు ఇసుక లభ్యత, ధరలపై నిత్యం మీడియాకు బులెటిన్ విడుదల చేయాలని మీనా అదేశించారు. జిల్లాస్థాయి వ్యవహరాలకు జాయింట్ కలెక్టర్‌ను బాధ్యునిగా చేస్తామన్నారు. గనుల శాఖ సంచాలకులు ప్రవీణ్ కుమార్ ఇబ్రహీంపట్నం కమిషనరేట్ నుంచి, ఆ శాఖ రాష్ట్రస్థాయి అధికారులు, ఏడీలు పాల్గొన్నారు.