హైకోర్టు ఆదేశం
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: విశాఖపట్నం జిల్లాలోని భీమిలి ఎర్రమట్టి దిబ్బల వద్ద తక్షణమే తవ్వకం పనులు నిలుపుదల చేయాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇక్కడి తవ్వకాలపై ఇటీవల ఉన్నత న్యాయస్థానంలో వ్యాజ్యం దాఖలైంది. జనసేన కార్పొరేటర్ మూర్తియాదవ్, మత్స్యకార నాయకుడు శంకర్ ఇందుకు సంబంధించి పిల్ దాఖలు చేశారు. దిబ్బలు తవ్వుతున్న ప్రదేశం వారసత్వ సంపద పరిధిలోకి వస్తుందని వారు పేర్కొన్నారు. అనుమతులు లేకుండా సొసైటీ పనులు చేస్తోందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ క్రమంలో పనులు నిలపాలని జీవీఎంసీ, ఇతర సంబంధిత శాఖలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
లైంగిక వేధింపు కేసులో ఎమ్మెల్యేకు ఊరట
సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలానికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన లైంగిక వేధింపుల కేసును ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. తనను బెదిరించి అత్యాచారం చేశారంటూ తిరుపతి జిల్లా కేవీబీ పురం మండలానికి చెందిన బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా… ఆదిమూలంపై తిరుపతి తూర్పు ఠాణా పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు కొట్టేయాలంటూ ఆదిమూలం హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల జరిగిన విచారణలో ఆయన తరపు సీనియర్ న్యాయవాది సి.రఘు వాదనలు వినిపిస్తూ… పోలీసులు ప్రాథమిక విచారణ చేయకుండా కేసు నమోదు చేశారన్నారు.
మూడో వ్యక్తి ఒత్తిడితో పిటిషనర్‌పై ఆ మహిళ ఫిర్యాదు చేశారన్నారు. ‘వలపు వల’ (హనీట్రాప్)గా దీనిని న్యాయవాది పేర్కొన్నారు. అత్యాచారం సెక్షన్ నమోదు చెల్లదనీ, ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలని కోరారు. ఫిర్యాదు చేసిన మహిళ తరపున న్యాయవాది కె.జితేందర్ వాదనలు వినిపించారు. ఆ మహిళ కూడా స్వయంగా కోర్టుకు హాజరై… ఆదిమూలంపై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోని ఆరోపణలు, ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న అంశాలన్నీ అవాస్తవమని పేర్కొంటూ అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకొని ఎమ్మెల్యేపై కేసు కొట్టేయాలని కోరారు.