24న బంగాళాఖాతంలో అల్పపీడనం
ఉత్తరాంధ్ర, కోస్తాకు భారీ వర్ష సూచన
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: రాష్ట్రానికి మళ్లీ తుపాన్ ముప్పు పొంచి ఉంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో కృష్ణానదికి రికార్డుస్థాయిలో వచ్చిన వరద… ఉప్పొంగిన బుడమేరు ప్రవాహ ధాటికి విజయవాడ నగరం ఇప్పట్లో కోలుకోలేని విధంగా దెబ్బతింది. కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాలు కూడా భారీ వర్షాలకు అతలాకుతలమ య్యాయి. లక్షల ఎకరాల పంట నాశనమైంది. ఇప్పుడిప్పుడే ఈ వరద ప్రభావం నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో మళ్లీ వాతావరణశాఖ మరో తుపాన్ ఉన్నట్లు హెచ్చరించడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఉత్తర, మధ్య బంగాళాఖాతం పరిసరాలలో ఈనెల 24వ తేదీన అల్పపీడనం ఏర్పడుతుందని, ఇది తీవ్ర రూపం దాల్చి తుపానుగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది. దీని ప్రభావం వల్ల ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే రాష్ట్రంలోని ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమగోదావరి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కోనసీమ, అనకాపల్లి జిల్లాలలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడిరచింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని, తీర ప్రాంతం వెంబడి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.