విశాలాంధ్ర`విజయపురిసౌత్/కర్నూలు: ఎగువ ప్రాంతాల నుంచి కృష్ణా నదికి వరద నీరు పోటెత్తుతోంది. దీంతో శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు 22 రేడియల్ క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువగల శ్రీశైలం జలాశయం నుంచి 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తి దిగువకు 4,03,455 క్యూసెక్కుల వరద నీటిని స్పిల్‌వే మీదుగా విడుదల చేశారు. కుడి, ఎడమ విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా 64745 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్ జలాశయంలోకి విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ జలాశయం నీటిమట్టం 585.40 అడుగుల (298.3895 టీఎంసీలు)కు చేరగానే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నాగార్జునసాగర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ నాగేశ్వరరావు నిరాడంబరంగా నీటిని దిగువకు విడుదల చేశారు. సోమవారం ముందుగా 6 గేట్లు, అనంతరం 10 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేయగా మంగళవారం ఏకంగా 22 ట్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు. విద్యుదుత్పాదన ద్వారా 28,907 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా మొత్తం 1,47,755 క్యూసెక్కుల వరద నీరు దిగువ కృష్ణానదిలోకి విడుదలవుతుంది. ఈ సందర్భంగా చీఫ్ ఇంజనీర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రొటోకాల్ ప్రకారం ఎగువ నుంచి వచ్చే వరదను బట్టి దిగువకు నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడిరచారు. నాగార్జునసాగర్ జలాశయానికి డ్యామ్ సైట్‌లో ఇన్ఫో 3,54,831 క్యూసెక్కులు నమోదవుతుండగా కుడి, ఎడమ కాల్వలతో పాటు ఎస్‌ఎల్బీసీ, వరద కాల్వలతో కలిపి మొత్తం సాగర్ జలాశయం నుంచి ఔట్ ఫ్లోగా 3,14,761 క్యూసెక్కులను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. సాగర్ జలాశయం గరిష్ఠ స్థాయి నీటిమట్టం 590.00 అడుగులు. 312.5050 టీఎంసీలకు సమానం. అయితే మూడేళ్లుగా సాగర్ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోకపోవడం, ఈ ఏడాది పైనుంచి భారీగా వరద నీరు వచ్చి సాగర్ జలాశయానికి చేరుకోవడంతో రిజర్వాయర్ గరిష్ఠ స్థాయికి చేరువలో ఉండడంతో దిగువ ప్రాంత రైతాంగం హర్షం వ్యక్తం చేస్తుండగా, క్రస్ట్ గేట్ల ద్వారా విడుదలవుతున్న నీటిని చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. మరోవైపు శ్రీశైలం జలాశయానికి కూడా వరదనీరు పోటెత్తుతోంది. మంగళవారం 10 గేట్ లు 12 అడుగుల మేర ఎత్తి దిగువనున్న సాగర్ కు 4,03,455 క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు. పోతిరెడ్డిపాడుకు 25000,మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తి పోతల పథకం ద్వారా 2400 క్యూసెక్కులు నీరు విడుదల చేశారు. కుడి, ఎడమ గట్టు విద్యుత్ ఉత్పత్తి కి 64745క్యూసెక్కుల నీటిని ఉపయోగిస్తున్నారు.. శ్రీశైలం జలాశయానికి ఎగువ నున్న జూరాల, సుంకేసుల నుంచి 3,38,340 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం జలాశయంలో 883 అడుగుల నీరు ఉంది. జలాశయం నీటి సామర్ధ్యం 215.807 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 212.387 టీఎంసీల నీరు ఉంది.