పులిచింతల ప్రాజెక్టులోని 16వ నంబర్ గేటు ప్రమాదవశాత్తూ కొట్టుకుపోయింది. నీటిని విడుదల చేసే క్రమంలో 16వ నెంబరు గేటు ఊడిపోయింది. దీనివల్ల ప్రకాశం బ్యారేజీకి వరదనీరు వెళ్తోంది.1,65,763 క్యూసెక్కుల మేర నీరు దిగువకు వెళుతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ సూచించారు. పులిచింతల డ్యాం 16వ గేట్ సాంకేతిక సమస్యతో ఊడిపోయిందని ఆయన తెలిపారు. దీని స్థానంలో స్టాప్ లాక్ గేట్ ఏర్పాటు చేస్తారని, ఇందుకు డ్యాంలో నీటి నిల్వ తగ్గించాల్సి వస్తోందని లేకపోతే నీటి ఒత్తిడి ఇతర గేట్లపై పడే అవకాశం ఉందన్నారు.పులిచింతల డ్యాం వద్ద ప్రస్తుతం ఔట్ ఫ్లో 2,00,804 క్యూసెక్కులు ఉండగా, ఇన్ ఫ్లో 1,10,000 క్యూసెక్కులుగా ఉంది. ప్రకాశం బ్యారేజీ వద్ద ఔట్ ఫ్లో 33,750 క్యూసెక్కులు కాగా, ఇన్ ఫ్లో 41,717 క్యూసెక్కులు ఉంది.