. అందుకే ఒలింపిక్స్‌లో నిరాశాజనక ఫలితాలు
. నిరుద్యోగం, రైతు ఆత్మహత్యల్లో ముందున్నాం
. ఏఐఎస్‌ఎఫ్ ఆవిర్భావ దినోత్సవాల్లో రామకృష్ణ
విశాలాంధ్ర- గుంటూరు కలెక్టరేట్: కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్లే ఒలింపిక్స్‌లో భారత్‌కు నిరాశాజనక ఫలితాలు వచ్చాయని ఏఐఎస్‌ఎఫ్ మాజీ నాయకులు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మండిపడ్డారు. అమెరికా, చైనా, జపాన్ వంటి దేశాలు అద్భుత ప్రతిభ చూపుతుంటే… భారత్ మాత్రం 71వ స్థానానికి పరిమితమైందన్నారు. నిరుద్యోగం, పేదరికం, రైతుల ఆత్మహత్యల్లో మోదీ సర్కారు ముందు వరుసలో ఉందని విమర్శించారు. ఏఐఎస్‌ఎఫ్ 89వ ఆవిర్భావ దినోత్సవాలు గుంటూరు మల్లయ్యలింగం భవన్‌లో సోమవారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు జాన్సన్ బాబు ఏఐఎస్‌ఎఫ్ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సదస్సుకు రామకృష్ణ మాట్లాడుతూ అంబానీ, అదానీ సంక్షేమమే ధ్యేయంగా మోదీ ప్రభుత్వం పని చేస్తోందని, దేశ సంపదను వారికే దోచిపెడుతోందని విమర్శించారు. స్వాతంత్య్ర పోరాటంలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలనే లక్ష్యంతో 1936 ఆగస్టు 12న ఉత్తర ప్రదేశ్‌లోని లక్నో నగరం బెనారస్ విశ్వవిద్యాలయంలో ఏఐఎస్‌ఎఫ్‌ను వేలాది మంది విద్యార్థులు స్థాపించారని గుర్తు చేశారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య సభ్యులు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారని అన్నారు. స్వాతంత్య్రం సాధించుకున్న తర్వాత దేశంలో అనేక విద్యార్థి ఉద్యమాలు, పోరాటాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. జాన్సన్ బాబు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన జీఓ 77 కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, బీటెక్ పూర్తి చేసి పీజీ సెట్ రాసిన విద్యార్థులకు రీయింబర్స్ మెంట్, స్కాలర్‌షిప్ వర్తించడం లేదని, దీనివలన విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించి జీఓ 77ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా 107, 108 జీఓల కారణంగా పేద మెరిట్ విద్యార్థులు ఎంబీబీఎస్ విద్యకు దూరం అవుతున్నారని, తక్షణమే ఈ జీఓలను కూడా రద్దు చేయాలని కోరారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు పౌష్టికాహారం లేక అనేక ఇబ్బందులుపడుతున్నారని, గత ఎనిమిది నెలలుగా పెండిరగ్‌లో ఉన్న మెస్, కాస్మోటిక్ చార్జీలను తక్షణమే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు శాశ్వత భవనాలు లేక అద్దె భవనాల్లో విద్యార్థులు సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దీనిపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని అన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, నాయకులు మేడా హనుమంతరావు, రాజశేఖర్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి బందెల నాసర్ జీ తమ సందేశం ఇచ్చారు. తొలుత ఇఫ్టా జాతీయ కార్యదర్శి గని అభ్యుదయ గేయాలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జంగాల చైతన్య, వలి, ఏఐఎస్‌ఎఫ్ నాయకులు యశ్వంత్, కిరణ్, శివా, నవ్యశ్రీ, డేవిడ్, అమర్నాథ్, కిరణ్, అజయ్, బన్నీ తదితరులు పాల్గొన్నారు.