విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి అరెస్టయ్యారు. ఏసీబీ అధికారులు గురువారం రాత్రి హైదరాబాద్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం ఉదయం విజయవాడ న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. ఏసీబీ కోర్టు అక్టోబరు 10వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. గనుల శాఖలో టెండర్లు, ఒప్పందాలు, ఏపీఎంఎంసీ నిబంధనలు, కార్యకలాపాలు, ఇసుక తవ్వకాల్లో భారీగా అక్రమాలు, అవినీతి, అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయన సస్పెండ్ అయ్యారు. ముఖ్యంగా జేపీవీఎల్, జీసీకేసీ, ప్రతిమ సంస్థలకు అనుచిత లబ్ధి కలిగించారనే ఆరోపణలున్నాయి. అయితే వెంకటరెడ్డి అప్పటికే తప్పించుకు తిరుగుతుండటంతో సస్పెన్షన్ నోటీసులను నేరుగా అందించడానికి వీలు లేకుండా పోయింది. గనుల శాఖాధికారుల ఫిర్యాదు మేరకు వెంకటరెడ్డిపై ఈనెల 11న ఏసీబీ కేసు నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టం, గనులు, ఖనిజాల చట్టంలోని సెక్షన్లతోపాటు, ఐపీసీలోని నమ్మకద్రోహం, కుట్ర తదితర సెక్షన్ల కింద అభియోగాలు నమోదయ్యాయి. ఆయన కోసం ఏసీబీ గాలిస్తుండగా హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించింది. అక్కడకు చేరుకున్న ఏసీబీ అధికారులు వెంకటరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.