సీఎంను అభిమానించే వాళ్లు తిరగబడాలి.. తద్వారా గొడవలు సృష్టించాలని కుట్రలు చేస్తున్నారని విపక్షాలను ఉద్దేశించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ. నేరాల్లో కొత్త కోణం కనిపిస్తోందని, అధికారం దక్కలేదనే రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని అన్నారు. ‘అధికారం దక్కలేదని సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్నారు.. చీకట్లో విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు.. ఆలయాల రథాలను తగలబెట్టారు. కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు.. పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియాన్ని అడ్డుకున్నారు. చివరకు ముఖ్యమంత్రిని కూడా దారుణమైన బూతులు తిడుతున్నారు. ఇది కరెక్టేనా.. ఇలా తిట్టడం కరెక్టేనా.. ఆలోచించండి. సీఎంను అభిమానించే వాళ్లు తిరగబడాలి.. తద్వారా గొడవలు సృష్టించాలని కుట్రలు చేస్తున్నారు. ఇది అనైతికం.. అధర్మం.. పచ్చి అబద్ధం’ అని అన్నారు. ‘పథకం ప్రకారం.. అక్కసుతో రాష్ట్రం పరువు తీస్తున్నారు. రాష్ట్రంలో అశాంతి సృష్టించాలని చూడటం సమంజసమేనా. అధికార పార్టీ పాలన మెచ్చుకుంటూ ప్రజలు అన్ని ఎన్నికల్లో గెలిపించారు. తనవాడు గెలవలేదని రాష్ట్రంలో కుట్రలు చేస్తున్నారు.’ అన్నారు. డ్రగ్స్‌తో ఏపీకి ఎలాంటి సంబంధం లేదని ఏపీ డీజీపీ, డీఆర్‌ఐ చెప్పినా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. డ్రగ్స్ ఏపీ అంటూ పచ్చి అబద్ధాలను గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. కొందరు రాష్ట్ర పరువు, ప్రతిష్టలను దిగజారుస్తున్నారని అన్నారు.