పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ఘనంగా జరిగింది. ఏటా వైభవంగా జరిగే ఉత్సవాలను ఈ ఏడాది కూడా సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. సిరిమానోత్సవాన్ని తిలకించేందుకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో అధికారులు 2,500మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. భక్తులకు విశేషంగా ఆకట్టుకునే సిరిమానోత్సవంలో సుమారు 55 అడుగులు నుంచి 60 అడుగుల వరకూ పొడవున్న సిరిమాను ఉపరితలంలో బిగించే ఇరుసుపై ఏర్పాటుచేసిన పీటపై ప్రధాన పూజారి విసనకర్ర చేతబట్టి ఆశీనులయ్యారు. రెండో చివరన రథంపై అమర్చిన ఇరుసును మానుకు అమరుస్తారు.దాని ఆధారంగానే మాను పైకిలేస్తుంది. గజపతిరాజు వంశీయులు తరఫున ఒకరు తాడు లాగడంతో ప్రారంభమయ్యే సిరిమాను ఊరేగింపు మూడులాంతర్లు వద్ద గల పైడితల్లి అమ్మవారి గుడి నుంచి రాజా బజారు మీదుగా కోట వరకూ మూడుసార్లు తిరిగింది.. సిరిమాను వేడుకల్లో పాల్గొనేందుకు ఏపీతో పాటు పక్కరాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో విజయనగరం పట్టణం భక్తజన సంద్రంగా మారింది.