ముఖ్యమంత్రికి రామకృష్ణ లేఖ
విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: ధర్మవరంలో జేఆర్ సిల్క్స్ అక్రమాలపై తగిన చర్యలు తీసుకోవాలని, నేతన్నల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు శుక్రవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో చేనేత పరిశ్రమకు ధర్మవరం పుట్టినిల్లు లాంటిదని, ధర్మవరంలో జేఆర్ సిల్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం జెట్లూమ్స్ (ర్యాపిడ్) ఏర్పాటు చేసి… చేనేత రిజర్వేషన్లకు విరుద్ధంగా ప్యూర్ చీరలు తయారు చేస్తూ చేనేత పరిశ్రమనే చిన్నాభిన్నం చేస్తోందన్నారు. ఫలితంగా చేనేత చీరలకు గిట్టుబాటు ధర లేక నేతన్నలు బలవన్మరణానికి పాల్పడే దుస్థితి దాపురించిందని వివరించారు. జేఆర్ సిల్క్స్ భారీ ఎత్తున సబ్సిడీపై ఫ్యాక్టరీ ఏర్పాటుచేసి దాదాపు 200కుపైగా జెట్లూమ్స్‌తో రోజుకు 600 నుంచి 800 ప్యూర్ టు ప్యూర్ చీరలు తయారు చేస్తూ అక్రమార్జనకు పాల్పడుతోందన్నారు. కోట్లాది రూపాయలు అక్రమంగా ఆర్జిస్తూ ధర్మవరంలో చేనేత పరిశ్రమ మనుగడకు ప్రమాదంగా తయారైందని, విచారణాధికారులు సైతం అవినీతికి పాల్పడుతూ జేఆర్ సిల్క్స్ ఫ్యాక్టరీకి క్లీన్‌చిట్ ఇస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలచే భారీ ఎత్తున సబ్సిడీలు పొందుతున్న జేఆర్ సిల్క్స్ స్థానిక నేతన్నలను విస్మరించి బీహార్, గుజరాత్ తదితర రాష్ట్రాలకు చెందిన కూలీలను పిలిపించుకొని పని చేయించుకుంటున్నదన్నారు. స్థానిక చేనేతలకు పనులు లేకపోవడంతో ఉపాధి కరువై ఇతర వృత్తుల వైపు వెళ్లలేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని వివరించారు. ఇది స్థానిక నేతన్నలకు తీరని అన్యాయమని, 11 రకాల చేనేత వస్త్ర ఉత్పత్తులకు సంబంధించి రిజర్వేషన్ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలన్నారు.
ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యాలయాన్ని ధర్మవరంలో ఏర్పాటు చేయాలని, నేతన్న నేస్తం పథకాన్ని 24 వేల నుంచి 36 వేల రూపాయలకు పెంచి సొంతమగ్గం ఉన్న వారితోపాటు అద్దె మగ్గాల్లో నేసే వారికి, ఉపవృత్తుల వారికి వర్తింప చేయాలన్నారు. చేనేతపై కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీని రద్దు చేయాలని, ఆదరణ పథకాన్ని పునరుద్ధరించి వృత్తి పరికరాలను సబ్సిడీపై పంపిణీ చేయాలని కోరారు. చేనేత వస్త్ర ఉత్పత్తులకు ప్రభుత్వమే మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలన్నారు. చేనేతలకు ప్రత్యేక బ్యాంకులు ఏర్పాటు చేసి సబ్సిడీ రుణాలు ఇవ్వాలన్నారు. జౌళి శాఖ నుంచి చేనేతను విడదీసి చేనేత పరిశ్రమను కాపాడాలని, చేనేతకు బడ్జెట్లో రూ.1000 కోట్లు కేటాయించాలని, చేనేత కార్మికులకు 3 సెంట్లు స్థలం ఇచ్చి పక్కాఇళ్లు, వర్క్‌షెడ్లను ప్రభుత్వమే ఉచితంగా నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం చేనేత కార్మిక పరిరక్షణ పోరాట కమిటీ అధ్వర్యంలో నేతన్నలు గురువారం జేఆర్ సిల్మ్స్ ఫ్యాక్టరీ వద్ద ధర్నా నిర్వహించారని గుర్తుచేశారు.