నాణ్యమైన బోధన, ఉపాధి కల్పనే ప్రభుత్వ లక్ష్యమని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఉన్నత విద్యపై తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం చేపట్టారు.ఈ సందర్భంగా అధికారులకు కీలక సూచనలు చేశారు. ఎయిడెడ్ విద్యాసంస్థల అప్పగింతలో ఎలాంటి బలవంతం లేదని సీఎం స్పష్టంచేశారు. చాలా విద్యాసంస్థల్లో సమస్యలు ఉన్నాయని చెప్పారు. ఎయిడెడ్ విద్యాసంస్థలను అప్పగిస్తే ప్రభుత్వమే చూస్తుందని అన్నారు. తామే నడుపుకుంటామని భావించినా ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. నియామకాల్లో పక్షవాతాలకు తావుండకూడదని, అత్యంత పారదర్శకంగా నియామక ప్రక్రియ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వర్శిటీల్లో బోధనా సిబ్బందిలో నాణ్యతతోపాటు ఉన్నత ప్రమాణాలు ఉండేలా నియామకం ఉండాలన్నారు. కోర్సుల్లో శిక్షణను ఇంటిగ్రేట్ చేయడంతోపాటు.. మైక్రోసాఫ్ట్‌లాంటి సంస్థలతో నిరంతరం శిక్షణ కొనసాగించాలని చెప్పారు..అప్పుడు ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయన్నారు. వర్శిటీల్లో అత్యుత్తమ అధ్యాపకుల క్లాసులను సబ్జెక్టుల వారీగా రికార్డ్ చేసి ఆన్‌లైన్‌లో పెట్టాలని సీఎం సూచించారు. విద్యార్థులు లెసన్స్ సులభంగా అర్థం చేసుకోవడానికి ఈ వీడియోలు ఉపయోగపడతాయని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక డిగ్రీ కాలేజీ ఉండేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం ఆదేశించారు.గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్ లాంటి వ్యవస్థలు సమర్థవంతంగా పనిచేయడానికి అవసరమైన విధానాలపై యూనివర్శిటీలు అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. ఆంగ్లం అన్నది తప్పనిసరి పాఠ్యాంశం కావాలని..ఆంగ్లం వల్ల ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని అన్నారు. ప్రమాణాలు పాటించని కాలేజీలపై రాజీపడొద్దని సూచించారు. ప్రతివారం ఒక్కో వీసీతో ఉన్నత విద్యామండలి సమావేశాలు నిర్వహించి.. తర్వాత నేరుగా ముఖ్యమంత్రి దృష్టికి సమస్యలు తీసుకురావాలన్నారు. వీటి పరిష్కారంపై ప్రణాళికలు, చర్యలు తీసుకుంటామన్నారు.