కడపలో శైలజానాథ్ వెల్లడి
విశాలాంధ్రకడప కలెక్టరేట్ : ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కూడబలుక్కుని ప్రజలను దోపిడీ చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ విమర్శించారు. పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ ధరల పెంపునకు వ్యతిరేకిస్తూ నగర కమిటీ, ఎన్‌ఎస్‌యూఐ అధ్వర్యంలో శుక్రవారం కడపలో జరిగిన సైకిల్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. శైలజానాథ్ సహా తులసిరెడ్డి, స్వాతి మలగి, జిల్లా అధ్యక్షుడు నీలి శ్రీనివాసరావు హాజరయ్యారు. మిత్రులకు మేలు చేసేందుకు 45 రూపాయలకు ఇవ్వవలసిన పెట్రోల్ 107 రూపాయలకు పెంచారని శైలజానాథ్ విమర్శించారు. పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ ధరలు తగ్గించే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల్లోకి రావాలంటే భయపడేలా పోరాటం చేస్తామన్నారు. ఇప్పటి వరకూ కాంగ్రెస్ శాంతియుతంగా కార్యక్రమాలు చేసిందని, ఇక ప్రజల బాధలు చూస్తూ ఊరుకోబోదని, ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీస్తామన్నారు. రాష్ట్రంలో చెత్త ప్రభుత్వం ఉందని, చెత్త మీద కూడా పన్నులు వసూలు చేస్తుందని విమర్శించారు. చెత్త పన్నుపై ఇక కాంగ్రెస్ సమర శంఖారావం పూరిస్తుందన్నారు. కార్యక్రమంలో నగర అధ్యక్షుడు విష్ణుప్రీతంరెడ్డి, ఉపాధ్యక్షుడు మధురెడ్డి, ఎన్‌ఎస్‌యూఐ నేతలు ధ్రువకుమార్‌రెడ్డి, బాబు ప్రసన్న, యూత్ కాంగ్రెస్ నేతలు లక్ష్మయ్య, పుల్లయ్య, మహిళా కాంగ్రెస్ నేతలు శ్యామలాదేవి, లావణ్య, సుజాతారెడ్డి, గోసాలదేవి, రాష్ట్ర నాయకులు శ్రీనివాసరెడ్డి, ప్రభాకర్, వెంకట రమణారెడ్డి, అలీఖాన్, జిల్లా నేతలు తిరుమలేష్, శ్రీరాములు చంద్రశేఖర్‌రెడ్డి, శర్మ, ఓబయ్య, రైతు నాయకుడు కృష్ణారెడ్డి, మైనార్టీ నాయకుడు ఖాదర్ ఖాన్, సిటీ మైనార్టీ ప్రెసిడెంట్ ఆసిఫ్‌ఖాన్, లూయిస్, మహేశ్వరి, గౌరీ, శంకర్‌రెడ్డి, గౌస్, వేణుగోపాల్‌రెడ్డి, రామిరెడ్డి పాల్గొన్నారు. సర్కారు లెక్కలు తేల్చాల్సిందే.. విశాలాంధ్ర బ్యూరో
అమరావతి: ప్రజా దోపిడీనే పరమావధిగా పరిపాలన సాగిస్తున్న అధికార వైసీపీ ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలన్నా, వారి కష్టనష్టాలన్నా లెక్కలేకుండా పోయిందని, రూ.41వేల కోట్ల ప్రజాధనంపై లెక్కలు తేల్చాల్సిందేనని పీసీసీ చీఫ్ డాక్టర్ సాకే శైలజానాథ్ డిమాండు చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని ఆలకించకుండా, తాడేపల్లిలోని ఇంటికే సీఎం జగన్ పరిమితమయ్యారని విమర్శించారు. ఎన్నికలు, పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీల అమలులో నిర్లక్ష్యం చూపుతున్నారన్నారు. నియంతృత్వ పోకడలతో ప్రభుత్వం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తోందని, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఖర్చుపెట్టే ప్రతి రూపాయికి పారదర్శకత అవసరమని పేర్కొన్నారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ తీరులో పారదర్శకత కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి రశీదులు లేకుండా ఖర్చు చేసిన ఆ 41వేల కోట్ల రూపాయలు ఏమయ్యాయంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా పదవులు, స్వప్రయోజనాలపై ఆలోచించడాన్ని విడనాడి ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టాలని కోరారు.