. ప్రజల దృష్టి మరల్చేందుకేనంటున్న రాజకీయ విశ్లేషకులు
. మోదీ మౌనంపై హేతువాదుల నిలదీత
. మనోభావాలపై దెబ్బ… దేనికి సంకేతం
విశాలాంధ్ర-డిజిటల్: ప్రాయశ్చిత్తం అనేది సంస్కృత పదం. హిందూ మతంలో ఇది ధర్మసూత్రాన్ని వివరిస్తుంది. ఒకరి తప్పులు లేదా దుష్కార్యాలను స్వచ్ఛందంగా అంగీకరించడం, కర్మ పరిణామాల రద్దు లేదా తీవ్రత తగ్గించడానికి ప్రాయశ్చిత్త దీక్ష ఉపయుక్తంగా ఉంటుంది. ప్రస్తుతం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందన్న వార్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆధ్యాత్మిక గురువుల నుంచి రాజకీయ నేతల వరకు ఆగ్రహం పుట్టిస్తోంది. హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ సామాన్య భక్తుల్లో సైతం కోపం కట్టలు తెంచుకుంటోంది. కల్తీకి పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలన్న డిమాండ్లు హల్‌చల్ చేస్తున్నాయి. దీన్ని ఆసరాగా తీసుకున్న ప్రధాన రాజకీయ పార్టీలు పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. లడ్డూ ప్రసాదం అపవిత్రమైందంటూ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దీక్షకు దిగడం రాజకీయంగా సందేహాలకు దారితీస్తోంది. ప్రతి హిందువూ ఆత్మపరిశీలన చేసుకోవాలి… మతాన్ని గౌరవించాలి… మీరంతా బయటకు రావాలి… తప్పు జరుగుతోందని కూర్చుంటే ప్రతిదీ ఇలాగే ఉంటుందన్న పవన్ మాటల్లో రాజకీయ హెచ్చరికలు, రెచ్చగొట్టేతత్వం కనబడుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తమకు ఎప్పుడో నివేదికలు అందాయని చెబుతున్న పాలకపక్ష నేతలు మూడు నెలల తర్వాత లడ్డూ ప్రసాదంలో పశువుల కొవ్వు కలిసిందని బ్రహ్మాస్త్రం విసిరారు. ల్యాబ్ పరీక్షలో తేలిందని ప్రచార బాణం వదిలారు. తిరుమల పవిత్రత దెబ్బతిందన్న ప్రచారాన్ని తారస్థాయికి తీసుకెళితే… అంతా నమ్మే అవకాశం ఉంటుందని, ప్రతిపక్షాన్ని హిందువుల మనోభావంతో పూర్తిగా కకావికలం చేయవచ్చన్న దుర్నీతి కనబడుతోందని అంటున్నారు. కిలో నెయ్యి కేవలం రూ.350కే కొనుగోలు చేస్తే కల్తీ కచ్చితంగా ఉంటుందన్నది భక్తుల మనసుల్లో నాటే ప్రయత్నం విజయవంతానికి శక్తివంచన లేకుండా చోటానేత నుంచి సీఎం వరకు చేయాల్సిందంతా చేస్తూ ఈ అంశాన్ని ప్రధాన ఆస్త్రంగా ఎంచుకున్నట్టు గోచరిస్తోందని వీరి భావన. అధికారం చేపట్టిన వెంటనే ఎందుకు ఈ అస్త్రాన్ని సంధించలేదన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న అంటున్నారు. రెడ్‌బుక్ లోకేశ్ చేతిలో లేదు… బాబు దగ్గర ఉందని, జాగ్రత్తగా మసలకుంటే 46 ఏళ్ల రాజకీయ జీవితం ముందు మోకరిల్లాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా… కల్తీ నెయ్యి కంటే రాజకీయ రగడ రాజేసేందుకే అధిక ప్రాధాన్యత ఇచ్చినట్టు గోచరిస్తోందని హేతువాదులు అభిప్రాయపడుతున్నారు. కల్తీ జరిగిందని నెలల క్రితమే తెలిసినా ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నిస్తున్నారు. అధికారంలో ఎవరు ఉంటే వ్యవస్థలన్నీ వారు చెప్పినట్టుగానే నడుస్తాయని, ఇందులో ఎలాంటి సందేహం లేదంటున్నారు. నెయ్యి కల్తీలో నిజమెంతో నేతి బీరకాయ సామెతను గుర్తుకు తెస్తుందంటున్నారు. నెరవేర్చలేని హామీలు ఇచ్చి… ప్రజలు నిలదీయకముందే… ప్రజల దృష్టి మరల్చేందుకే డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడుతున్నారు.
నిజాలు నిగ్గుతేల్చకుండా… జుగుప్సాకర రాజకీయం చేస్తున్నారు… దేశవ్యాప్తంగా కల్తీపై గగ్గోలు పెడుతుంటే మోదీ ఎందుకు మౌనం దాల్చారని ప్రశ్నిస్తున్నారు. కూటమి అండ కోసమేనా అని నిలదీస్తున్నారు. లడ్డూ కల్తీపై రాజకీయ దుమారం దౌర్భాగ్యమంటున్నారు. నగ్నసత్యాన్ని మరుగుపరిచి రాజకీయ క్రీడకు తెరలేపారని, అభంశుభం తెలియని చిన్నారులు సైతం నవ్వుకుంటున్నారని, నిజం నిర్ధారణ కాకముందే ఘోరం జరిగిందంటూ ప్రాయశ్చిత్త దీక్ష జుగుప్సాకరంగా ఉందన్నారు. ప్రాయశ్చిత్తం స్వప్రయోజనానికా… సమాజ హితానికా అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు.