కేంద్ర అన్యాయంపై 2న నిరసనలు: షర్మిల
విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: చంద్రబాబు, పవన్, జగన్ బీజేపీకి గులాం గిరీ చేస్తున్నారని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తుంటే వారు ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. విజయవాడ ఏ
1 కన్వెన్షన్ సెంటరులో గురువారం షర్మిల అధ్యక్షతన పీసీసీ నూతన కార్యవర్గ సమావేశం జరిగింది. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం ఠాగూర్, ఏఐసీసీ సెక్రటరీ పాలక్ వర్మ, రఘువీరారెడ్డి, కేవీపీ రామచంద్రరావు, గిడుగు, రుద్రరాజు, సాకే శైలజానాథ్, జేడీ శీలం, తులసిరెడ్డి హాజరయ్యారు. షర్మిల మాట్లాడుతూ బీజేపీతో ఒకరిది అక్రమ పొత్తు అయితే… మరొకరిది సక్రమ పొత్తు అని ఎద్దేవా చేశారు. అక్టోబరు రెండో తేదీ గాంధీ జయంతి రోజున బీజేపీ రాష్ట్రానికి చేసిన అన్యాయంపై నిరసన చేపడతామని చెప్పారు. బీజేపీ చేసిన అన్యాయంపై యుద్ధం చేయాలన్నారు. 2029లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో రావాలని, తాను రాజకీయాల్లో అడుగు పెడతానని ఏ రోజు అనుకోలేదని, కానీ పరిస్థితులు తీసుకొచ్చాయని చెప్పారు. తాను వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశానని, ప్రస్తుతం నా అవసరం అక్కడ లేదని, ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాల్సి ఉందని, అందుకే ఇక్కడ నా అవసరం ఉందన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అవ్వాలనేదే వైఎస్‌ఆర్ కోరిక అని చెప్పారు. రాహుల్ ప్రధాని అయితేనే మనకు ప్రత్యేక హోదా వస్తుందని, విభజన సమస్యలు అన్నీ నెరవేరతాయని పేర్కొన్నారు. అందరినీ కలుపుకుని ముందుకెళ్లాలని కోరారు. రఘువీరారెడ్డి మాట్లాడుతూ… రాబోయే రోజుల్లో గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్దామని చెప్పారు. షర్మిల న్యాయకత్వంలో పార్టీ బలోపేతం అవుతుందన్నారు. జమిలి ఎన్నికలు బీజేపీ సొంత అజెండా అని విమర్శించారు.