ఇది ప్రజా విజయమంటూ ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి కడప జిల్లా బద్వేలు ఉపఎన్నిక ఫలితంపై స్పందించారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, బీజేపీ పోటీ చేసినా కథ నడిపింది చంద్రబాబే అని అన్నారు. సంక్షేమ పాలనకే ప్రజలు పట్టం కట్టారని చెప్పారు. ‘‘బద్వేల్ ఫలితం మరింత బాధ్యత పెంచింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనకు ప్రజలు ఇచ్చిన మద్దతు ఇది. ఇది దళితులు, బీసీలు, సామాన్యుల విజయం. ప్రజలు మా వైపే నిలిచారు సీఎం జగన్ పారదర్శక పాలనకు ప్రజలు అండగా నిలిచారు. నిరంతరం దుష్ప్రచారం చేసే టీడీపీ, బీజేపీలకు బుద్ధి చెప్పారు. బీజేపీ గతంలో ఇచ్చిన హామీలు విస్మరించినందుకు ప్రజలు బుద్ధి చెప్పారు. ప్రత్యేక హోదా సహా, విభజన చట్టంలోని హామీలేవి బీజేపీ నెరవేర్చలేదు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఫలాలు అందించాలన్నది సీఎం జగన్ లక్ష్యం. ఆయన క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు. అందుకే ప్రజలు ఆయనకు ప్రతి ఎన్నికల్లోనూ మద్దతుగా నిలుస్తున్నారని’’ అన్నారు.