చంద్రబాబుకు వివిధ సమస్యలపై రామకృష్ణ వినతిపత్రం
విశాలాంధ్ర – మంగళగిరి : బుడమేరు ముంపు నివారణకు శాశ్వత పరిష్కారం అత్యవసరమని, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు, గోదావరి వరద బాధితులకు పరిహారం అందజేయాలని, పోడు భూముల రైతుల సమస్యలు పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. రామకృష్ణ సోమవారం సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిశారు. వివిధ సమస్యలపై చంద్రబాబుకు వినతిపత్రాలు అందజేశారు. అనంతరం రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వరదలకు విజయవాడ సహా అనేక ప్రాంతాల్లో నష్టం వాటిల్లిందని, సహాయకచర్యల్లో కమ్యూనిస్టు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నామని చెప్పారు. బుడమేరు టు కొల్లేరు యాత్ర చేశామని, అందులో తాము పరిశీలించిన అంశాలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లామన్నారు. బుడమేరు ఆక్రమణ కారణంగానే విజయవాడ వరద ముంపునకు గురైందని, ఆక్రమణలు తొలగించకుంటే భవిష్యత్తులో మరింత ప్రమాదం ఏర్పడుందని సీఎంకు వివరించామన్నారు. బుడమేరును ప్రక్షాళన చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారన్నారు. బాధితులకు కొంతమందికి రూ.10 వేలు ఇస్తున్నారని, అందరికీ రూ.25 వేలు ఇవ్వాలని తాము విన్నవించామని రామకృష్ణ చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో వరద సాయం అందడం లేదని, తమ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి నేతృత్వంలో సీపీఐ ప్రతినిధి బృందం రెండు రోజులు గిరిజన ప్రాంతాల్లో పర్యటించిందన్నారు. ఒకరిద్దరు అధికారులు వచ్చినా గిరిజనులకు ఎటువంటి సాయం అందలేదని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చామని రామకృష్ణ చెప్పారు. ఏ.కొండూరు మండలంలో కిడ్నీ బాధితులు ఎక్కువుగా ఉన్నారని, ఆ ప్రాంతానికి ట్యాంకర్ల ద్వారా మంచినీరు సరఫరా చేయాలని కోరామన్నారు. డయాలిసిస్ సెంటర్‌లో మౌలిక సదుపాయాలు లేవని, నైపుణ్యం గల వైద్య సిబ్బంది అందుబాటులో లేరని తెలిపామన్నారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యపై సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు నాయకత్వంలో సుదీర్ఘకాలంగా పోరాటం జరుగుతోందని, అయినా ఇప్పటికీ పరిష్కారం కాలేదని, ఈ విషయంపై దృష్టి సాధరించాలని చంద్రబాబుకు విన్నవించామన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులు వేలం వేసి…ఆ సొమ్ముతో బాధితులను ఆదుకోవాలని కోరామన్నారు. చేనేత కార్మికుల సమస్యలను జేవీ సత్యనారాయణమూర్తి, చేనేత నాయకుడు పిల్లలమర్రి నాగేశ్వరరావు సీఎంకు వివరించారన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడానికి కేంద్రం కుట్ర చేస్తోందని, నిర్వాసితుల సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేదని, దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని చంద్రబాబుకు విన్నవించామని రామకృష్ణ తెలిపారు. సుదీర్ఘకాలం జైలు జీవితం గడుపుతున్న ఖైదీలను విడుదల చేయాలని, తిరుపతి లడ్డూ వ్యవహారంపై ఇక సాగదీత అవసరం లేదని సూచించామన్నారు. రామకృష్ణ వెంట సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, జేవీ సత్యనారాయణ మూర్తి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జల్లి విల్సన్, అక్కినేని వనజ, డేగా ప్రభాకర్, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్, విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు, అల్లూరి జిల్లా కార్యదర్శి పి.సత్యనారాయణ, ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతీ వరప్రసాదరావు, గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కారం దారయ్య, ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి నాగేశ్వరరావు, చేనేత నాయకుడు బత్తూరి మోహనరావు తదితరులు ఉన్నారు.