సీఎం చంద్రబాబు
విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: రాష్ట్రంలో యూట్యూబ్ అకాడమీ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని, ఆ మేరకు కంపెనీ ప్రతినిధులతో చర్చించినట్లు సీఎం చంద్రబాబు వెల్లడిరచారు. ఈ మేరకు మంగళవారం ‘ఎక్స్’ వేదికగా ఈ విషయాన్ని ఆయన ట్వీట్ చేశారు. ప్రపంచస్థాయి టెక్ దిగ్గజ సంస్థలను, పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావడమే లక్ష్యంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. యూట్యూబ్ సీఈవో నీల్ మోహన్, గూగుల్ ఏపీఏసీ హెడ్ సంజయ్ గుప్తాతో వర్చువల్‌గా సమావేశమైనట్లు వివరించారు. వారిద్దరితో ఆన్ లైన్ వేదికగా తాను భేటీ కావడం ఆనందంగా ఉందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, నైపుణ్యాభివృద్ధి, సర్టిఫికేషన్ పోగ్రామ్‌లను ప్రోత్సహించేందుకు స్థానిక భాగస్వాముల సహకారంతో ఈ అకాడమీ ఏర్పాటుపై చర్చించామని వివరించారు. అమరావతి రాజధానిలో ఏర్పాటు చేయబోయే మీడియా సిటీకి సాంకేతిక సహకారం అందించే అవకాశాల పైనా వారితో చర్చించినట్లు సీఎం ట్వీట్‌లో వివరించారు.