సుప్రీంలో వైవీ సుబ్బారెడ్డి, సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్లు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు చేయించాలని వైసీపీ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, రాజ్యసభ మాజీ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి వేర్వేరుగా సుప్రీంకోర్టులో సోమవారం పిటిషన్లు దాఖలు చేశారు. సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం( పీఐఎల్`పిల్) దాఖలు చేసిన వైవీ సుబ్బారెడ్డి… లడ్డూ వివాదంపై సుప్రీం రిటైర్డ్ జడ్జీతో విచారణ జరిపించాలని, ఆయనకు సహకరించేందుకు ఫుడ్ టెక్నాలజీ నిపుణులతో కూడిన కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వాడారంటూ గత ప్రభుత్వాన్ని నిందిస్తూ సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలపై దర్యాప్తు జరిపేలా ఆదేశించాలని ఆ పిటిషన్‌లో విన్నవించారు. శ్రీవారి ఆలయంపై హిందువులకు సెంటిమెంట్ ఉంటుందని, స్వామివారికి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఉన్నారని, స్వామి వారి ప్రసాదాలు, లడ్డూను భక్తులు అతిపవిత్రంగా భావిస్తారని వివరించారు. అలాంటి ప్రసాదంలో జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యి వాడారని బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న సీఎం ఆరోపించడాన్ని తప్పుపట్టారు. ఇది హిందువులు, కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని, ఈ అంశంలో నిజాలు నిగ్గు తేల్చాలని అభ్యర్థించారు. ఈనెల 21న టీటీడీ ఈఓ మీడియాతో మాట్లాడుతూ కల్తీ చేసినట్లు ఆరోపణలు వచ్చిన నెయ్యి వాడలేదని, నాణ్యత లేదని తేలిన నెయ్యి ట్యాంకర్లు వెనక్కి పంపించామని గుర్తుచేశారు. వీటన్నింటి నేపథ్యంలో వాస్తవాలు ఏమిటనేది అందరికీ తెలియాల్సి ఉందని, తమ అభ్యర్థన మన్నించి విచారణ కోసం రిటైర్డ్ న్యాయమూర్తిని నియమించాలని కోరారు. కాగా, తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై నిరాధార వ్యాఖ్యలు చేసిన సీఎం చంద్రబాబుపై దర్యాప్తు చేయించాలని రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి సుప్రీంను కోరారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ఆయన తెలిపారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవని, ప్రసాదం కలుషితమైందన్న ఆయన వ్యాఖ్యలు భక్తుల్లో ఆందోళన రేకెత్తించాయని వివరించారు. అందుకే దర్యాప్తునకు ఆదేశించేలా సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసినట్లు వివరించారు. ఈ పిల్ శుక్రవారం విచారణకు రానుంది.