వెంకయ్యనాయుడు, రాజకీయ నేతల నివాళి
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ప్రజా ప్రతినిధిగా, రాజకీయ విశ్లేషకుడిగా అడుసుమిల్లి జయప్రకాశ్ ప్రజల మనస్సులో శాశ్వతంగా నిలిచిపోతారని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. సోమవారం విజయవాడ శేషసాయి కల్యాణమండపంలో జయప్రకాశ్ సంతాప కార్యక్రమం నిర్వహించగా వివిధ రంగాల, రాజకీయ ప్రమఖులు హాజరై ఘనంగా నివాళి అర్పించారు. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్న అడుసుమిల్లి జయప్రకాశ్ ఎన్నో రాజకీయ వ్యాసాలు రాయడమే కాక టీవీ ఇంటర్వ్యూల్లో వర్తమాన రాజకీయాలను విశ్లేషించి మంచి రాజకీయ వ్యాఖ్యాతగా గుర్తింపు పొందారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, వల్లభనేని బాలశౌరి, మాజీ ఎమ్మెల్సీ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు జల్లి విల్సన్, శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్, గద్దె రామ్మోహన్, కామినేని శ్రీనివాస్, వెనిగళ్ల రాము, మాజీ ఎంపీలు ఆచార్య యార్లగడ్డ లక్షీప్రసాద్, కేవీపీ రామచంద్రరావు, వడ్డే శోభనాద్రీశ్వరరావు, లగడపాటి రాజగోపాల్, మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎంఎల్‌ఏ మల్లాది విష్ణు పాల్గొన్నారు.