టీడీపీ పార్లమెంటరీ భేటీలో చంద్రబాబు
విశాలాంధ్ర బ్యూరో ` అమరావతి : జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో చేస్తున్న కుట్రలు, కుతంత్రాలు, అరాచకాలను పార్లమెంటులో ప్రస్తావించి ఎండగట్టాలని టీడీపీ ఎంపీలకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు సూచించారు. శుక్రవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా విజృంభించడం, ప్రజలకు సరైన వైద్యం అందకపోవడం, కరోనా కోసం కేంద్రం కేటాయించిన నిధులను దారి మళ్లించడం, మృతుల సంఖ్యను తక్కువగా చూపడం, కరోనా ప్యాకేజీ ఇవ్వకపోవడం వంటి అంశాలను పార్లమెంటులో ప్రస్తావించాలన్నారు. సంక్షోభ సమయంలో ప్రజలకు అండగా నిలవాల్సిన ముఖ్యమంత్రి చేతులెత్తేసి లక్షలాదిమంది కరోనా బారిన పడేలా చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి కేటాయించిన నిధులను దారి మళ్లించడం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కక్ష సాధింపు చర్యలకు వినియోగిస్తూ.. అక్రమ కేసులు పెట్టడం వంటి అంశాలను పార్లమెంటులో లేవనెత్తాలన్నారు. అలాగే వీరోచిత పోరాటాలు, ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు కృషి చేయాలని, స్టీల్‌ప్లాంట్ భూములను కాజేసేందుకు వైసీపీ చేస్తున్న కుట్రలను పార్లమెంటులో ఎండగట్టాలన్నారు. సేవాభావంతో పనిచేస్తూ లక్షలాదిమంది ప్రజల పురోభివృద్ధికి తోడ్పడిన మాన్సాస్ ట్రస్టుపై జగన్ రెడ్డి కక్షసాధింపు చర్యలకు దిగుతున్న వైనాన్ని కూడా ప్రస్తావించాలన్నారు. వైసీపీ రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డికి చెందిన రాంకీ కంపెనీలో రూ.300 కోట్ల బ్లాక్‌మనీని ఆదాయ పన్ను శాఖ అధికారులు గుర్తించిన అంశాన్ని, టిడ్కో ఇళ్లను తెలుగుదేశం హయాంలో నిర్మిస్తే వాటిని డిపాజిట్‌దారులకు అందించకుండా పాడుబెడుతున్న అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తాలని సూచించారు. ప్రత్యేక హోదా, వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధికి ప్యాకేజీ, విభజన చట్టంలోని హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, రెండేళ్ల నుంచి ఉపాధి హామీ పథకం కింద చేసిన పనులకు కేంద్రం నిధులు ఇచ్చినప్పటికీ వాటిని ఇవ్వకుండా దారి మళ్లించి కాంట్రాక్టర్లను వేధిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. న్యాయస్థానాలు ఆదేశించినా ఉపాధి హామీ బిల్లులు చెల్లించకుండా కాంట్రాక్టర్లపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారన్న అంశాన్ని కూడా పార్లమెంటు దృష్టికి తీసుకురావాలన్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కస్టడీలో ఉన్న పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణరాజుపై దాడికి పాల్పడడం, ఏపీ సీఐడీ అధికారులు వ్యవహరించిన తీరు, వైసీపీ ప్రభుత్వం బరితెగింపు చర్యలను, టీడీపీ శ్రేణులపై అక్రమ కేసులను కేంద్ర హోం మంత్రిని కలిసి ఫిర్యాదు చేయాలని చంద్రబాబు ఎంపీలకు సూచిం చారు. ఈ సమావేశంలో టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, కేశినేని నాని, కనకమేడల రవీంద్ర, అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, టీడీ జనార్థన్ పాల్గొన్నారు.