రిజర్వేషన్ల ఉద్యమ సమయంలో తుని రైలు దహనం ఘటనలో కేసుల ఎత్తివేతపై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం హర్షం వ్యక్తం చేశారు. కాపు ఉద్యమానికి సంబంధించిన పలు కేసులు ఎత్తివేయడంపై సంతోషం వ్యక్తం చేసిన ముద్రగడ.. సీఎం జగన్‌కు శుక్రవారం లేఖ రాశారు. ఈ మేరకు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. చెయ్యని నేరానికి తమను ముద్దాయిలను చేస్తూ కేసులు పెట్టడం అన్యాయమని వాపోయారు. తన జాతి తనను ఉద్యమం నుంచి తప్పించినా.. ఆ భగవంతుడు మీ ద్వారా ఆ కేసులకు మోక్షం కలిగించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. సీఎం వైఎస్ జగన్‌ను వ్యక్తిగతంగా కలవలేకపోతున్నానని పేర్కొన్నారు. కలిస్తే తమ జాతిని అడ్డుపెట్టుకొని ‘కోట్లు సంపాదించుకోవడానికి, పదవులు పొందడానికి వెళ్లాన’ని అనిపించుకోవడం ఇష్టంలేక కలువలేకపోతున్నానని ముద్రగడ తన లేఖలో పేర్కోన్నారు.