ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో డీజీపీ గౌతం సవాంగ్ భేటీ అయ్యారు. పీఆర్సీ జీవోలను రద్దు చేయాలంటూ ఉద్యోగులు నిర్వహించిన ‘చలో విజయవాడ’ నేపథ్యంలో సీఎంతో డీజీపీ సమావేశమయ్యారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చిన డీజీపీ సీఎంను ప్రత్యేకంగా కలిశారు. పోలీసులు ఆంక్షలు విధించినా లక్షల సంఖ్యలో ఉద్యోగులు విజయవాడకు చేరుకోవడంపై చర్చ జరిగినట్లు తెలిసింది. పోలీసు నిర్బంధాలు, ఆంక్షలు పెట్టినా ఉద్యోగుల పోరాటం విజయవంతం కావడంపై పోలీసు వైఫల్యంగానే పార్టీ నేతలు కూడా అభిప్రాయపడ్డారు. ఉద్యోగులకు పోలీసులు సహకరించారన్న విషయంపై డీజీపీని జగన్ ప్రశ్నించినట్లు సమాచారం. అలాగే ఉద్యోగుల నిరసనల నేపథ్యంలో భవిష్యత్ లో తీసుకోవాల్సిన చర్యలపై డీజీపీకి సీఎం పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది.