జల్లి విల్సన్
విశాలాంధ్ర-బెలగాం : ప్రజల్ని చైతన్యపర్చే పార్టీగా భారత కమ్యూనిస్టు పార్టీ బలోపేతమే లక్ష్యంగా కృషి చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ పార్టీ శ్రేణులకు పిలపునిచ్చారు. మంగళవారం పార్వతీపురం మన్యం జిల్లా సీపీఐ జిల్లా జనరల్ బాడీ సమావేశం స్థానిక బెలగాం గిరిజన భవన్ లో జిల్లా కార్యదర్శి కూరంగి మన్మధరావు అధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిధిగా హాజరైన జల్లి విల్సన్ మాట్లాడుతూ… ఉద్యమాలకు నిలయమైన పార్వతీపురం మన్యం జిల్లాలో పార్టీ క్యాడర్‌ను పెంచాలని నాయకులకు సూచించారు. ఎన్నికలకు ముందు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకిచ్చిన హామీలు అమలు చేసే విధంగా పార్టీ కార్యకర్తలు ఒత్తిడి తీసుకురావాలన్నారు. కార్యకర్తలంతా నిరంతరం ప్రజలతో మమేకమై ప్రజలకు పార్టీ గురించి చెప్పాలన్నారు. గ్రామ స్థాయిలో సీపీఐని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి. కామేశ్వరరావు మాట్లాడుతూ ఈరోజు రాష్ట్రంలో సీపీఐ ప్రతిపక్ష పాత్ర పోషిస్తోందని తెలిపారు. గ్రామస్థాయిలో ఉన్న కార్యకర్తలు, నాయకులంతా ప్రజా సమస్యలపై పోరాడేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలో నవంబర్ 28, 29, 30 తేదీలలో ఎఐఎస్‌ఎఫ్ మహాసభలు జరుగునున్నాయని, దీనికి అన్ని ప్రజాసంఘాలు, విద్యార్ది సంఘాలు, పార్టీ శాఖల నాయకులు హాజరై విజయవంతం చేయవలసినదిగా కోరారు. సిపిఐ జిల్లా కార్యదర్శి కూరంగి మన్మధరావు మాట్లాడుతూ… రానున్న కాలంలో జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో సీపీఐ బలోపేతానికి ప్రతి కార్యకర్త సైనికుల్లా కృషి చేయాలన్నారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి టి. జీవన్న మాట్లాడుతూ ఏనుగుల సమస్య, అధ్వాన్న రోడ్లు, గుమ్మలక్ష్మిపురం మండలంలో ఇళ్ల స్థలాలపైన సీపీఐ తరపున ఉన్నతాధికారులకు వినతిపత్రాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ఉమ్మడి జిల్లాల కార్యదర్శి ఆర్వీఎస్ కుమార్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బొచ్చ మోహనరావు, డీహెచ్‌పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుజ్జ జనార్దన్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఈవి నాయుడు, బుడితి అప్పలనాయుడు, గరుగుబిల్లి సూరయ్య, కె.గోపి నాయుడు, జిల్లా సమితి సభ్యులు సాలాపు అనంతరావు, బి.బంగార్రాజు, సింహాద్రి దుర్గారావు, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి బి.రవికుమార్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి బీటీ నాయుడు, పార్టీ నాయకులు గెంబలి శ్రీనివాసరావు, రాగోలు దుర్గా ప్రసాద్, గోవిందరావు, జె.నూకరాజు, జి.మోహన్ రావు, ఎ.అప్పారావు, ఆర్.ముత్యాలు, మహిళా సమాఖ్య నాయకులు చింతాడ అన్నపూర్ణ, నాగవంశం జానకమ్మ, సంధ్య తదితరులు పాల్గొన్నారు.