వెంకట సుబ్బయ్య
విశాలాంధ్ర`విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో పౌర సరఫరాల శాఖలో పనిచేసే హమాలీలకు కూలి రేట్ల పెంచేలా జీవోలు తక్షణమే విడుదల చేయాలని ఏపీ స్టేట్ సివిల్ సప్లైయ్ హమాలీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వెంకట సుబ్బయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే గురు, శుక్రవారాల్లో ఉద్యమాలు కొనసాగుతాయని హెచ్చరించారు. దసరా లోగా తదుపరి సమస్యలు పరిష్కరించకపోతే పౌర సరఫరాల శాఖ భవన్ ముట్టడికి కార్మిక వర్గం సిద్ధమవుతుందని తేల్చిచెప్పారు. వేతనం పెంపుకు డిమాండ్ చేస్తూ హమాలీలు బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా 253 మండల స్టాక్ పాయింట్‌ల వద్ద నిరసనలు చేపట్టారు. కళ్లకు గంతలు కట్టుకొని ‘ఓ గుడ్డి ప్రభుత్వమా..మా బాధలు కనపడలేదా..మా కష్టాలు వినపడలేదా…’ అంటూ నినదిస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. విజయవాడ గొల్లపూడి డిపో వద్ద నిరసనలో వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ 100 రోజుల పాలనలో హమాలీల సమస్యలు పరిష్కరించలేదన్నారు. గత ప్రభుత్వం సివిల్ సప్లై కార్పొరేషన్ హమాలీల విషయంలో చర్చలు జరిగి ఆరు నెలలు గడుస్తున్నట్లు తెలిపారు. గత వేతన ఒప్పందం ముగిసి తొమ్మిది నెలలవుతున్నా పట్టించుకోవడంలేదని అన్నారు. కూలి రేట్లు, బోనసు, యూనిఫామ్ కట్టుకూలి, స్వీట్ ప్యాకెట్స్ వంటివి తక్షణమే కల్పించాలని డిమాండ్ చేశారు. రవాణా మార్గం మార్పు చేసే పద్ధతిని రద్దుచేసి రేషన్ షాపుల కుదింపును ఆపాలన్నారు. ప్రతి నెల 10వ తేదీ లోపు హమాలీల బిల్లు చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో గొల్లపూడి హమాలీలు పెద్ద మేస్త్రి తాతయ్య వీర్రాజు రమణయ్య పాల్గొన్నారు.