విశాలాంధ్ర బ్యూరో- అమరావతి: రాష్ట్రంలో భారతీయ తయారీ విదేశీ మద్యానికి (ఐఎంఎఫ్‌ఎల్) ఎటువంటి కొరత లేదని అబ్కారీ శాఖ సంచాలకులు నిషాంత్ కుమార్ తెలిపారు. వినియోగానికి అవసరమైన మేరకు నిల్వలు రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయని చెప్పారు. సాధారణంగా 90 వేల కేసుల ఐఎంఎఫ్‌ఎల్, 23 వేల కేసుల బీరు రాష్ట్రంలో రోజువారీ సగటు వినియోగంగా ఉందని, ప్రస్తుతం ఉన్న నిల్వలు కనీసం 20 రోజుల వరకు సరిపోతాయని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లిక్కర్ డిపోలలో 20 లక్షల కేసుల ఐఎంఎఫ్‌ఎల్, 5.6 లక్షల కేసుల బీరు విక్రయానికి అందుబాటులో ఉందని నిషాంత్ కుమార్ వివరించారు. విభిన్న అవుట్ లెట్‌ల పరంగా 6.93 లక్షల కేసుల ఐఎంఎఫ్‌ఎల్ సిద్దంగా ఉందని, పూర్వపు సగటు వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ నిల్వ 9 రోజులు సరిపోతుందని తెలిపారు. కేవలం వరదల కారణంగా తగిన నిల్వ సామర్ధ్యం లేక విజయవాడలోని కొన్ని అవుట్ లెట్లలో నిల్వలు తగ్గుముఖం పట్టాయని వివరించారు. గత సంవత్సరం సెప్టెంబరు నెలలో విక్రయాల విలువ 2487 కోట్లుగా ఉండగా, ఈ సంవత్సరం ఇప్పటికే రూ.1972 కోట్ల మేర విక్రయాలు జరిగాయని చెప్పారు. బుధవారంతో కలిపి రానున్న ఆరురోజుల్లో గత సంవత్సరం ఇదే నెలలో చేసిన విక్రయాల స్థాయికి చేరుకోవటం సుసాధ్యమని తెలిపారు. వైన్ షాపులలో నిల్వలు లేక వినియోగదారులు బార్లను ఆశ్రయిస్తుండటం వల్ల ప్రభుత్వ అదాయం తగ్గుతుందన్న దానిలో ఎటువంటి వాస్తవం లేదని అన్నారు. వైన్‌షాపు లేదా బార్‌లో ఎక్కడ విక్రయం జరిగినా అదాయం ప్రభుత్వానికే చెందుతుందని ఆయన వివరించారు.