ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 23వ తేదీన 13వేల 326 గ్రామ పంచాయతీల్లో మునుపెన్నడూ లేని విధంగా ఒకేరోజు గ్రామ సభలను నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కె.పవన్‌కల్యాణ్ వెల్లడిరచారు. గ్రామ సభలపై సోమవారం రాష్ట్ర సచివాలయం నుంచి ఆయన జిల్లా పరిషత్ సీఈవోలు, డీపీవోలు, డ్వామా పీడీలు, ఎంపీడీవోలు తదితర అధికారులతో వీడియో సమావేశం నిర్వహించి గ్రామ సభలు విజయవంతానికి తీసుకోవాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేశారు. పవన్ కల్యాణ్ మాట్లాడుతూ పంచాయతీరాజ్, గ్రామీణాభివద్ధి శాఖల్లో పనిచేయడ మంటే గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు, నిరుపేద కూలీలకు సేవ చేయడమేనని తాను నమ్ముతున్నాని చెప్పారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామ పంచాయతీ నుంచి జిల్లా పరిషత్ వరకూ పటిష్టంగా ఉన్నప్పుడే అనుకున్న అభివృద్ధి సాధించగలుగుతామని, తద్వారా మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధించ గలుగుతామని చెప్పారు. ఈనెల 23వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 13,326 గ్రామ పంచాయితీల్లో గ్రామ సభలు నిర్వహించడం ద్వారా ప్రజలకు అనేక అంశాలపై అవగాహన కల్పిస్తామన్నారు. ఉపాధిహామీ పథకంలో ప్రతి కుటుంబానికి ఏడాదిలో 100 రోజుల పని దినాలను కల్పిస్తున్న అంశంపై అవగాహన కల్పించడంతో పాటు కూలీలకు గల హక్కుల గురించి తెలియజేసి అవగాహన కల్పించాల్సిన అవసరముందని అధికారులకు స్పష్టంచేశారు. గ్రామ సభ సమాచారాన్ని కనీసం రెండు రోజులు ముందుగానే ఆయా గ్రామాల్లో దండోరా వేయించి ప్రజలందరికీ తెలియజేయడం ద్వారా ప్రజలందరూ అధిక సంఖ్యలో గ్రామ సభలో పాల్గొనేలా చూడాలన్నారు. జిల్లా పంచాయతీ అధికారులు గ్రామ పంచాయతీ అధికారులు, సిబ్బందికి గ్రామ సభ నిర్వహణపై పూర్తి అవగాహన కల్పించాలని చెప్పారు. ఉపాధిహామీ పథకం అమలుకు సంబంధించి కొంత మంది డ్వామా పీడీలు గ్రామాలను సందర్శిచడం లేదని, పని ప్రదేశాలను తనిఖీ చేయడం లేదని,సోషల్ ఆడిట్ సభలకు హాజురు కావడం లేదని కింది స్థాయి అధికారులపై నియంత్రణ లేదనే కొన్ని వాస్తవాలు తన దృష్టికి వచ్చాయని పవన్ కల్యాణ్ అన్నారు.పనికి సంబంధించిన రిజిష్టర్లు, వర్క్ ఫైల్స్ చాలా మండలాల్లో సరిగ్గా నిర్వహించడం లేదని, ఇక మీదట ఎంపీడీఓలు పూర్తి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, మండల స్థాయిలో జరిగే అవకతవకలకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఉపాధిహామీ పథకం అమలుకు సంబంధించి ఏపీఓలు, ఈసీలు, టీఏలు తమ బాధ్యతలను సరిగా నిర్వర్తించడం లేదని చాలా ఫిర్యాదులు వస్తున్నాయని, అలాంటి వారిని ఎంతమాత్రం ఉపేక్షించేది లేదన్నారు. అవినీతి ఏస్థాయిలో జరిగినా క్షమించేది లేదని స్పష్టంచేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశి భూషణ్ కుమార్, రాష్ట్ర సంచాలకులు కృష్ణతేజ్, అధికారులు బాలూ నాయక్,సంజీవ రెడ్డి,వాటర్ షెడ్ డైరెక్టర్ పీవీఆర్ఎంరెడ్డి, అదనపు కమిషనర్ సుధాకర్ రావు, జాయింట్ కమిషనర్ శివప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.