విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: ఉచితంగా ఇసుక ఇవ్వడానికి కట్టుబడి ఉన్నామని, ఇకపై 24గంటలు బుకింగ్ చేసుకోవచ్చు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇసుక నిర్వహణ విధానం నూతన పోర్టల్‌ను ఆయన గురువారం వెలగపూడి సచివాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధికారులకు మార్గదర్శకాలు చేశారు. ఇసుక బుకింగ్ విషయంలో సమయ నిబంధనలు అవసరం లేదన్నారు. రానున్న వారం రోజుల్లో ఇసుక బుకింగ్‌కు సంబంధించి ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా దృష్టి పెట్టాలని సూచించారు. చిన్న వాగులు, వంకలలో ఉండే ఇసుక విషయంలో సమీప గ్రామాల ప్రజలను ఇబ్బంది పట్టరాదని, ప్రతి ఒక్కరికీ ఇసుక అందేలా పారదర్శకత ఉండాలని ఆదేశాలిచ్చారు. అక్రమ రవాణా, మైనింగ్‌కు అవకాశంలేకుండా చర్యలు ఉండాలన్నారు. విజిలెన్స్ వ్యవస్థను పటిష్టపర్చాలని చంద్రబాబు ఆదేశించారు. అబ్కారీ, గనులు, భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ఇసుక సరఫరా కు సంబంధించి మూడో పార్టీ తనిఖీకి పెద్ద పీట వేస్తున్నామని చెప్పారు. ప్రతి అంశాన్ని మూడో పార్టీ ఎప్పటికప్పుడు గమనిస్తుందన్నారు. నూతన పోర్టల్ వల్ల వివిధ దశలలో అనుక్షణం నిఘా ఉంటుందని, అధికారుల మొదలు రవాణాదారుల వరకు తప్పుకు ఆస్కారం ఉండరాదన్నారు. ఆయా జిల్లాల కలెక్టర్‌ల నేతృత్వంలోని జిల్లా స్థాయి కమిటీలు స్థానిక వ్యవస్థలను నియంత్రిస్తాయని తెలిపారు. పోర్టల్‌లో జిల్లాల వారీగా సరఫరా కేంద్రాలు, రవాణా చార్జీలు వంటి వివరాలు ఏ రోజుకు ఆ రోజు అప్‌డేట్ అవుతాయని చెప్పారు. లారీల యజమానులు, మధ్యవర్తుల పేరిట వసూలు చేస్తున్న అధిక ధరల నియంత్రణకు ఈ పోర్టల్ దోహదమవుతుందని మంత్రి తెలిపారు. ఉచిత ఇసుక విషయంలో ప్రజలు తమ ఇబ్బందులను టోల్‌ఫ్రీ నంబర్ 1800-599-4599కు ఫిర్యాదు చేయవచ్చని, ప్రతి ఫిర్యాదుపైనా చర్యలు ఉంటాయన్నారు. సంబంధిత వ్యక్తులకు కలక్టరేట్ల నుంచి సమాచారం అందుతుందని మంత్రి వెల్లడిరచారు. గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేశ్ కుమార్ మీనా మాట్లాడుతూ ఇసుక రవాణా లారీలకు జీపీఎస్ అనుసంధానం చేయటం వల్ల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయగలమన్నారు. ప్రజాభివప్రాయ సేకరణ పద్ధతికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ఐవీఆర్‌ఎస్ కాల్స్ ద్వారా ఎప్పటికప్పుడు వినియోగదారుల స్పందనను తీసుకుంటామన్నారు. పటిష్టంగా చెక్ పోస్టులను నిర్వహిస్తామని తెలిపారు. ఇసుక కొరత లేకుండా స్టాక్‌యార్డ్‌లలో లోడిరగ్ సామర్థ్యాన్ని పెంచడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తామని ముఖేశ్ కుమార్ చెప్పారు. గనుల శాఖ సంచాలకులు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఇసుక ఎగుమతి కేంద్రాలలో సీసీటీవీ నిఘా ఉంటుందన్నారు. జిల్లా స్థాయి కమిటీలకు తగిన బాధ్యతలు, అధికారాలు అప్పగించామని తెలిపారు. కార్యక్రమంలో సీఎంఓ, గనుల శాఖ అధికారులు పాల్గొన్నారు.