ఇటీవలి ఎన్నికల్లో కేవలం 11 అసెంబ్లీ సీట్లు, 4 ఎంపీ సీట్లు గెలిచి ఘోర పరాభవం మూటగట్టుకున్న వైసీపీకి ఆ తర్వాత కూడా ఎదురుదెబ్బలు తప్పడంలేదు. పార్టీ నుంచి ఒక్కొక్కరే వైదొలగుతున్నారు. తాజాగా, ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా అదే బాట పట్టారు. పోతుల సునీత నేడు వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆమె తన రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్ కు, శాసనమండలికి పంపించారు. కాగా, పోతుల సునీత ఏ పార్టీలో చేరేది తెలియరాలేదు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ఆమె వెల్లడించారు. పోతుల సునీత వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఉన్నారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం ద్వారా ఆమె ఈ పదవికి కూడా రాజీనామా చేసినట్టయింది.