రోజురోజుకూ లోన్ యాప్స్ దారుణాలు శృతి మించిపోతున్నాయి. వెంటపడి మరీ లోన్ ఇస్తామంటూ ఆకర్షణీయమైన ప్రకటనలు. అవి చూసి టెంప్ట్ అయి మిడిల్ క్లాస్ లోన్ తీసుకోవడం ఆ తర్వాత అసలుకు మించి డబుల్ వడ్డీలు కట్టలేక విధిలేని పరిస్థితిలో ఆత్మహత్యలకు పాల్పడటం..లోన్ యాప్ వేధింపులు తరచుగా వార్తలలో కనిపించే దృశ్యాలు. అందుకే ఇటువంటి వాటిని నియంత్రించాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసకునే దిశగా అడుగులు వేస్తోంది. లోన్ యాప్ సంస్థల ప్రకటనలకు ఎవరూ ఆకర్షితులు కావద్దంటున్నారు ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత. ఈ మధ్య లోన్ యాప్ కారణంగా చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని..అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దంటున్నారు మంత్రి వంగలపూడి అనిత. విజయవాడలో నేడు జరిగిన వాకథాన్ అవేర్ నెస్ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, లోన్ యాప్ నిర్వాహకులు ఎక్కువ శాతం మోసకారులే ఉన్నారని హెచ్చరించారు. ..పైగా వీరు పెరిగిన సాంకేతికతను తెలివిగా ఉపయోగించుకుంటున్నారని..కొన్ని సందర్భాలలో ఓటీటీ నెంబర్ తీసుకుని మన బ్యాలెన్స్ ను తెలివిగా దొంగిలిస్తున్నారన్నారు. అసలు డబ్బులు మననుంచి ఎప్పుడో రాబట్టేస్తారని, ఆ తర్వాత. వడ్డీలు, చక్రవడ్డీలంటూ అసలుపై రెండు మూడింతలు వసూలు చేస్తారని పేర్కొన్నారు.. ఎక్కువగా మధ్యతరగతిని టార్గెట్ చేస్తున్నారని అంటూ లోన్ కట్టడం కాస్త లేట్ అయితే చాలు వారి బంధువుల ఇళ్లకు సమాచారం ఇచ్చేస్తున్నారని చెప్పారు. దీనితో అవమానం తట్టుకోలేక కొన్ని సందర్భాలలో రుణదాతలు ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఇకపై ఇలాంటి లోన్ యాప్ లపై ప్రత్యేక దృష్టి పెట్టామని అనిత తెలిపారు. ప్రతి జిల్లాలోనూ సైబర్ సెల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అనుమానిత లోన్ యాప్ లపై సైబర్ సెల్ కు కంప్లయింట్ ఇవ్వొచ్చని..దానిపై దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చారు .