గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల బదిలీలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. షెడ్యూల్ ప్రకారం నిన్నటితోనే ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉండగా పింఛన్ల పంపిణీ దృష్ట్యా వారిని రిలీవ్ చేయొద్దని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. కొన్ని శాఖలకు బదిలీ ప్రక్రియ నుంచి మినహాయింపు ఇవ్వగా తదుపరి ఉత్తర్వులు వచ్చాకే ట్రాన్స్ఫర్ చేయాలని కలెక్టర్లకు సూచించింది. ఇదిలా ఉంటె ప్రభుత్వం సాధారణ బదిలీలకు పచ్చజెండా ఊపడంతో ఉద్యోగుల్లో బదిలీల సందడి నెలకొంది. ఈనెల 31వ తేదీ లోపు బదిలీల ప్రక్రియ పూర్తి కావాలని ప్రభుత్వం గడువు విధించింది. చాలాకాలం తర్వాత సాధారణ బదిలీలు జరుగుతుండడంతో, అన్ని శాఖల ఉద్యోగులు తాము కోరుకున్న ప్రాంతాలకు వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కీలక స్థానాల కోసం పైరవీలు సాగిస్తున్నారు. సిఫార్సు లేఖల కోసం ఎమ్మెల్యేలు, మంత్రుల కార్యాలయాలకు క్యూ కడుతున్నారు. ఆదాయ వనరులున్న ప్రాంతాల్లో ఈ డిమాండ్ ఎక్కువగా ఉంది.
తొలుత కలెక్టర్లు, ఎస్‌పిలు, జెసిలు వంటి ప్రధాన బదిలీలు జరిగాయి. ఆ తర్వాత డిఎస్‌పిలు, తహశీల్దార్లు, ఎంపిడిఒల బదిలీలు పూర్తయ్యాయి. ప్రస్తుతం పలు శాఖల్లో కిందిస్థాయి ఉద్యోగి వరకు బదిలీలు చేపడుతున్నారు. విద్యా, వైద్య, జైళ్ల శాఖలకు మాత్రం బదిలీలు లేవు. జిల్లాలో రెవెన్యూ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సెర్ప్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, సివిల్ సప్లై, మైనింగ్ అండ్ జియాలజీ, అన్ని విభాగాలకు చెందిన ఇంజినీరింగ్ స్టాఫ్, ఎండోమెంట్, ట్రాన్స్‌పోర్టు, ఇండిస్టీస్, ఎనర్జీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, వాణిజ్య పన్నుల శాఖ, ఎక్సైజ్ శాఖల్లో బదిలీలు చేపడుతున్నారు.