భారీ వర్షాలు, వరదలతో పలు రైల్వే ట్రాక్ లు దెబ్బతినడంతో విజయవాడ-హైదరాబాద్ మధ్య రైళ్ల రాకపోకలను దక్షిణ మధ్య రైల్వే శాఖ నిలిపివేసిన సంగతి విదితమే. అయితే వర్షాలు కాస్త నిమ్మదించిన వేళ ౌ తాజాగా ఈ మార్గంలో రైలు సర్వీసులను అధికారులు పునరుద్ధరించారు. మహబూబాబాద్ జిల్లా కే.సముద్రం సమీపంలో ట్రాక్ మరమ్మతులు పూర్తి కావడంతో రైలు సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌కు వెళ్లే రైళ్లను వరంగల్ మీదుగా పంపిస్తున్నారు. ట్రయల్ రన్‌లో భాగంగా విజయవాడ నుంచి గోల్కండ ఎక్స్‌ప్రెస్‌ను ముందుగా పంపారు. ఆ రైలు విజయవాడ, గుంటూరు, వరంగల్ మీదుగా హైదరాబాద్ వెళ్లింది. అప్‌లైన్‌లో సర్వీసులను పునరుద్ధరించామని.. డౌన్‌లైన్‌లో బుధవారం అర్ధరాత్రికి పనులు పూర్తిచేస్తామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. ఇప్పటికే పలు రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే వాటిలో కొన్నిటిని దారి మళ్లించి నడుపుతోంది. కొన్ని చోట్ల దెబ్బతిన్న ట్రాక్‌ల మరమ్మతులు కొనసాగుతున్నాయి. కాజీపేట-విజయవాడ సెక్షన్‌లో వానలకు దెబ్బతిన్న ట్రాక్‌ను పునరుద్ధరించే పనులు జరుగుతున్నాయి. భారీ వర్షాలతో కోతకు గురైన మహబూబాబాద్‌లోని రైల్వే ట్రాక్ మరమ్మతు పనులు పూర్తయినట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ఇంటికన్నె ఉ కే.సముద్రం మధ్య ట్రాక్ కిందిభాగం వరదకు కొట్టుకుపోగా, సుమారు 500ల మంది సిబ్బందితో పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఉదయం 9 గంటలకు మరమ్మతు పనులు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ముందుగా ఖాళీ రేక్‌లతో సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌ను ట్రాక్ మీదుగా నడిపించినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు. ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రయాణికులతో గోల్కండ ఎక్స్‌ప్రెస్‌ను ఈ మార్గంలో నడిపిస్తామని తెలిపారు. ఆ తర్వాత వరుసగా రైళ్ల రాకపోకలు అప్‌లైన్‌లో కొనసాగుతాయన్నారు. డౌన్‌లైన్ పనులు కూడా శరవేగంగా కొనసాగుతున్నాయని సాయంత్రం వరకు ఈ మార్గంలోనూ నడిపించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. రెండులైన్లు అందుబాటులోకి వస్తే రద్దయిన రైళ్లను వరసగా పునరుద్ధరిస్తామని అధికారులు వెల్లడించారు.