హైదరాబాద్ : ‘మా’ ఎన్నికలు జరిగిన తీరుపై రోజుకొకరు స్పందిస్తున్నారు. తాజాగా ‘పెళ్లిసందడి’ ప్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవి మాట్లాడగా, మంగళవారం ఆయనకు ఎంతో ఆత్మీయుడైన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు స్పందించారు. ‘పెళ్లిసందడి’ ప్రమోషన్‌లో భాగంగా విశాఖపట్నం వెళ్లిన ఆయన అక్కడ మీడియాతో మాట్లాడారు. ‘మా’ ఎన్నికల్లో ఇంతటి అలజడి సృష్టించడం తెలుగు సినీ పరిశ్రమకు మంచిది కాదని అన్నారు. సినీ పెద్దలంతా కలిసి ‘మా’ అధ్యక్షుడిగా ఒకరిని ఏకగ్రీవంగా ఎన్నుకుని ఉంటే బాగుండేదన్నారు. అదే మంచి పద్ధతి కూడా అని అభిప్రాయపడ్డారు. మంచు విష్ణు అధ్యక్షుడిగా రాణిస్తాడనే నమ్మకం ఉందని రాఘవేంద్రరావు చెప్పారు. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కిన ‘పెళ్లిసందడి’ చిత్రం ఈనెల 15న విడుదల కానుంది.