హైదరాబాద్ : విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొం దుతున్న ‘లైగర్’ సినిమా తాజా షెడ్యూల్ ను అమెరికాలో ప్లాన్ చేశారు. ఈ నెల 12వ తేదీన ఈ సినిమా టీమ్ అమెరికా వెళుతోంది. ఈ విషయాన్ని ఆదివారం విశాఖలో జరిగిన ‘పుష్పక విమానం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ స్వయంగా చెప్పాడు. అంతేకాదు తాను నిర్మించిన ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే బాధ్యత అభిమానులదేనని అన్నాడు. లైగర్‌లో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపించనున్నాడు. ఆయన జోడీగా అనన్య పాండే తెలుగు తెరకు పరిచయమవుతోంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాతో తన కెరియర్ నెక్స్ట్ లెవెల్ కి వెళుతుందనే నమ్మకంతో విజయ్ దేవరకొండ ఉన్నాడు. ఈ సినిమా ఈపాటికి ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నా కరోనా కారణంగా షూటింగుకు అంతరాయం కలుగుతూ వచ్చింది. దాంతో వాయిదాలు వేసుకుంటూనే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది.