దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు శుక్రవారం సుప్రీంకోర్టు ఎట్టకేలకు బెయిలు మంజూరు చేసింది. 2021-22 నాటి దిల్లీ మద్యం కేసులో సీబీఐ నమోదు చేసిన అవినీతి, డబ్బు అక్రమ చెలామణి కేసులో నిర్బంధంలో ఉంచి 17 నెలల తరవాత సుప్రీంకోర్టు ఆయనను బెయిలు మీద విడుదల చేసింది. సిసోడియాను 2023 ఫిబ్రవరి 26న అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఆయన నిర్బంధంలోనే ఉన్నారు. అయితే ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్టొరేట్ గానీ, సీబీఐ కానీ ఆయన మీద రెండున్నరేళ్లుగా కనీసం చార్జ్‌షీట్ కూడా దాఖలు చేయకుండా నిరవధికంగా నిర్బంధంలో ఉంచడం కుదరదని సుప్రీంకోర్టు అభిప్రాయపడిరది. అలాగే సుప్రీంకోర్టు చేసిన మరో ఆరోపణ కూడా చాలా ముఖ్యమైంది. బెయిలు నియమం, తప్పనిసరి అయితేనే జైలు అన్న సూత్రాన్ని అమలు చేయకుండా కింది కోర్టులు, హైకోర్టులు వాటంగా తప్పించుకుంటున్నాయని దీనివల్ల అనేక కేసులు వివిధ కోర్టుల్లో పేరుకు పోతున్నాయని కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు బి.ఆర్.గవాయ్, కె.వి. విశ్వనాథన్ తీవ్రమైన వ్యాఖ్యలే చేశారు. ఇదే కేసులో మొట్ట మొదట అరెస్టు అయింది సత్యేంద్ర జైన్. తరవాత సంజయ్ సింగ్‌ను అరెస్టు చేశారు. కానీ ఆయనకు బెయిలు మంజూరు అయింది. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా జైలులోనే ఉన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎత్తి చూపినట్టుగా మనీశ్ సిసోడియా కేసులో 493 మంది సాక్షులున్నారని సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టొరేట్ అంటోంది. ఈ సాక్షులందరినీ విచారించడానికి, అసలు విచారణ ప్రారంభం కావడానికి ఎంత సమయం పడ్తుంది, చివరకు ఎప్పటికి ఈ వ్యవహారం కొలిక్కి వస్తుంది అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. విచారణే ప్రారంభం కాకుండా 17 నెలలపాటు నిర్బంధంలో ఉంచడం రాజ్యాంగంలో మనిషికి జీవించే హక్కును, స్వేచ్ఛను ప్రదానంచేసే 21వ అధికరణాన్ని ఉల్లంఘించడమేనని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సిసోడియా కేసులో విచారణ ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుందో చెప్పాలని న్యాయమూర్తులు సీబీఐని, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టొరేట్‌ను ప్రశ్నించడం చాలా వాస్తవికమైందే కాక విప్లవకరమైన ప్రశ్న కూడా. విచారణ ప్రారంభంకాకుండా ఎవరినైనా సుదీర్ఘకాలం పాటు జైలులో ఉంచడం అంటే ‘‘విచారణ లేకుండా శిక్ష విధించడమే’’ అని న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్య కూడా తీవ్రమైందే. దిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్‌ను డబ్బు అక్రమ చెలామణి నిరోధకచట్టం (పి.ఎం.ఎల్.ఎ.) కింద 2022 మే లో అరెస్టు చేశారు. ఆయన మీద మద్యం కేసు లేదు. ఆయనకూ ఇంతవరకు బెయిలు ఇవ్వనే లేదు. ఆ తరవాత సిసోడియాను 2023 ఫిబ్రవరి 26న అరెస్టు చేస్త్తే ఆయన రెండు రోజుల తరవాత ఉపముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. పి.ఎం.ఎల్.ఎ. కేసు మోపి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టొరేట్ సిసోడియాను 2023 మార్చి 9న అరెస్టు చేసింది. ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను 2024 మార్చి 21న మద్యం కేసులోనే అరెస్టు చేశారు. ఆయన మీద కూడా పి.ఎం.ఎల్.ఎ. కేసు, అవినీతి కేసు మోపారు. కానీ వీరంతా డబ్బు ఏ రీతిలో అక్రమంగా చెలామణి చేశారో ఇంతవరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టొరేట్ రుజువు చేయలేక పోయింది. ఆ డబ్బు ఆచూకీ కూడా పట్టుకోలేక పోయింది.
అత్యంత ప్రచారంలో ఉన్న దిల్లీ మద్యం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీలో నోరు విప్పి మాట్లాడగలిగే వారినందరినీ ఇరికించారు. అరెస్టు చేశారు. కానీ చార్జ్‌షీట్ మాత్రం దాఖలు చేయకపోవడం సీబీఐ, ఎన్‌ఫోర్స్ మెంటు డైరెక్టొరేట్ నిష్క్రియాపరత్వానికి ప్రతీక. ఈ ధోరణిని సుప్రీంకోర్టు సైతం గుర్తించింది. ఆమ్ ఆద్మీ పార్టీ అగ్ర నాయకులను అవినీతి, పి.ఎం.ఎల్.ఎ. కేసుల్లో అరెస్టు చేయడం వెనక బీజేపీ క్షుద్ర రాజకీయాలున్నాయని పదే పదే చెప్పాల్సిన అవసరంలేదు. ఈ అంశాన్ని సుప్రీంకోర్టు కూడా గుర్తిస్తూనే ఉంది. కానీ ఈ విషయంలో అత్యున్నత న్యాయస్థానం చేయగలిగింది ఏమీ లేదు అన్న విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ ఉన్నత న్యాయస్థానాల న్యాయమూర్తులు పదవీ విరమణ సందర్భంలో జరిగే వీడ్కోలు సమావేశాల్లో, వివిధ కేసుల విచారణా క్రమంలో చాలా ఉత్తేజకరమైన, స్ఫూర్తిదాయకమైన వ్యాఖ్యలు చేస్తుంటారు. అవి చాలా వినసొంపుగా ఉంటాయి. కానీ అత్యున్నత న్యాయ పీఠాల మీద ఆశీనులైన వారు తాము చెప్పిన అంశాలను ఆచరణలో తీర్పుల్లో ప్రస్తావించిన సందర్భాలు తక్కువ. సిసోడియాకు బెయిలు మంజూరు చేసిన సమయంలో న్యాయమూర్తులు గవాయ్, విశ్వనాథం చేసిన వ్యాఖ్యలు న్యాయం మిగిలే ఉంది అన్న ఆశలు కల్పిస్తాయి. కానీ కింది కోర్టులు, హైకోర్టులు ‘‘బెయిలు హక్కు, తప్పని సరి అయితేనే జైలు’’ అన్న సూత్రాన్ని పాటించని న్యాయస్థానాల మీద చర్య మాత్రం తీసుకోవు. కింది కోర్టులు, హైకోర్టులకు ఈ విషయంలో తగిన మార్గదర్శక సూత్రాలు జారీ చేసిన దాఖలాలే కనిపించవు. బెయిలు హక్కు, తప్పనిసరి అయితేనే జైలు అన్న సూత్రాన్ని ఎందుకు అమలు చేయడంలేదో హైకోర్టులతో సహా కింది కోర్టులకు సరైన మార్గదర్శక సూత్రాలు జారీచేసే అధికారం సుప్రీంకోర్టుకు లేదా. సుప్రీంకోర్టు చెప్పేదే అంతిమ న్యాయం అయినప్పుడు కింది కోర్టులు, హైకోర్టులు భిన్నంగా ప్రవర్తించే అవకాశం ఎందుకు ఇస్తున్నట్టు. బీమా కోరేగావ్ కేసు అయిదేళ్లకు పై నుంచి నానుతోంది. అందులో ప్రముఖ రచయితలను, న్యాయవాదులని, పౌర హక్కుల కోసం పోరాడే వారిని అరెస్టు చేశారు. కొందరికి బెయిలు వచ్చింది. స్టాన్ స్వామి నిర్బంధంలో ఉండగానే ప్రాణాలు వదిలారు. ఆ కేసులో కూడా విచారణ ప్రారంభమే కాలేదు. సత్వర విచారణ జరిగేలా చూడవలసిన బాధ్యత ప్రభుత్వాలది అనుకుంటే ఆ ప్రభుత్వాలను కట్టడి చేయోచ్చుగా. ఆ పని సుప్రీంకోర్టు ఎన్నడూ చేయలేదు. విచారణ ప్రారంభం అయినా విచారణ దశాబ్దాల పాటు కొనసాగడానికి బాధ్యత న్యాయవ్యవస్థదే కాదా. పేరుకు పోయిన కేసులను తెమల్చడానికి న్యాయవ్యవస్థకు అనేక అడ్డంకులు ఉండవచ్చు. ఈ అడ్డంకులను సరిదిద్దడానికి అత్యున్నత న్యాయస్థానం ఎన్నిసార్లు ఆదేశించిందో లెక్కలేమైనా ఉన్నాయా. సత్వర విచారణ పూర్తి కాకపోవడానికి ప్రభుత్వాలది, న్యాయవ్యవస్థది బాధ్యత అయినప్పుడు అక్కడో సిసోడియాకు, ఇక్కడో దేవాంగనా కలితకు బెయిలు మంజూరు చేసినా ఫలితం ఏముంటుంది? గత మే 21న దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి స్వర్ణ కాంత శర్మ, జూన్ 4న సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అరవింద్ కుమార్, సందీప్ మెహతాతో కూడిన బెంచిని సుప్రీం కోర్టు అంతిమంగా తిరగతోడి ఉండవచ్చు. ఇలాంటి సందర్భాలలో సుప్రీంకోర్టు బెయిలు హక్కు అని చెప్పినా ఆ సూత్రాన్ని అమలు చేయని చేయని వారి మీద చర్య తీసుకునే వారే ఉండరా. సిసోడియా కేసులో తీర్పు నిరంకుశత్వానికి చెంప పెట్టు, సత్యమే గెలుస్తుంది లాంటి నినాదప్రాయ భావనవల్ల, ఇది న్యాయవ్యవస్థ విజయం అని జబ్బలు చరుచుకున్నందువల్ల ఫలితం ఏమీ ఉండదు. లోపం ఎక్కడుంది అన్న అంశం నిందితులకు సంబంధించింది కాదు. కచ్చితంగా లోపాన్ని సరిదిద్ద వలసిన బాధ్యత అత్యున్నత న్యాయస్థానానిదే. అడపా దడపా జరిగేది న్యాయం కానేరదు.