వారంరోజుల్లో మూడు అత్యాచారాలు. కోల్‌కతాలోని ఆర్.జి కార్ వైద్య కళాశాలలో 31 ఏళ్ల డాక్టర్ పై ఈ నెల తొమ్మిదిన కళాశాల ఆవరణలోనే అత్యాచారం, హత్య జరిగాయి. ఆమె మధ్య తరగతికి చెందిన వారు. అందుకని సహజంగానే మీడియా దృష్టి, చైతన్యవంతమైన సమాజందృష్టి ఈ అత్యాచారంపై కేంద్రీకృ తమైంది. ఆ తరవాత రెండురోజులకే బీహార్‌లోని ముజఫర్ పూర్‌లో ఒక దళిత బాలికపై కూడా అత్యాచారం జరిగింది. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో చెత్త ఏరుకునే కుటుంబానికి చెందిన ఈడురాని బాలికపై గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారం చేశాడు. జోధ్‌పూర్ లో చెత్త ఏరుకుని బతికే ఆ కుటుంబం గుడి ముందు నిద్రిస్తుండగా ఓ కిరాతకుడు మూడేళ్ల బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ మూడు సంఘటనల్లో ఏది చిన్నది, ఏది పెద్దది అని చెప్పడానికి వీలు లేదు. మూడూ ఘోరమైనవే. ఖండిరచదగినవే. శిక్షార్హమైన కిరాతక నేరాలే. కానీ కోల్‌కతా లోని వైద్య కళాశాలలో జరిగిన అత్యాచారం, హత్య మాత్రమే అందరి దృష్టిని ఆకర్షించింది. దళిత అమ్మాయిపై అత్యాచారం చేసింది కామాంధులు మాత్రమే కారు. వారు కామంధులు కూడా. అందుకేనేమో ఆ అంశాన్ని మీడియాతో సహా సమాజంలోని ఏ వర్గమూ పట్టించుకోవడం లేదు. కోల్ కతా లో వైద్య కళాశాలలో జరిగిన అత్యాచారం కేసును సుప్రీంకోర్టు తనంత తాను విచారణకు చేపట్టింది. సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ అత్యాచారానికి పాల్పడినవారు ఇప్పటిదాకా గుర్తు తెలియని వారు కావచ్చు. కానీ ముజఫర్‌పూర్ లో ఈ నెల ఆగస్టున దళిత బాలికపై అత్యాచారం చేసిన వారు అనామకులు కారు. వారు సంపన్నులు, పలుకుబడిగల కుటుంబాలకు చెందినవారు. అందుకేనేమో ఈ ఉదంతాన్ని ప్రశ్నిస్తున్న వారే కనిపించడంలేదు. అలాంటిది జోధ్‌పూర్ లో మూడేళ్ల బాలికపై అత్యాచారాన్ని ఎవరు పట్టించుకుంటారు కనక! ఆ బాలిక కుటుంబం చెత్త ఏరుకుని బతుకుతుంది కనక వారి ఘోష వినేవారు ఎవరుంటారు. కోల్‌కతా సంఘటనపై దేశమంతా గగ్గోలు జరిగింది. ఈ అత్యాచారాన్ని నిర్భయ కేసుతో పోల్చి చూసినవారు ఉన్నారు. అందరి దృష్టినీ ఆకర్షించినందువల్లే సుప్రీంకోర్టు తనంత తాను విచారణకు అంగీకరించింది. మంగళవారం విచారణ జరుగుతుంది. జోధ్‌పూర్ అత్యాచారాన్ని తలుచుకునే వారే కనిపించడంలేదు. కోల్‌కతా సంఘటన అత్యంత క్రూరమైంది కనక సుప్రీంకోర్టు వెంటనే జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టు న్యాయవాదులు ఉజ్వల్ గౌర్, రోహిత్ పాండే గత 15వ తేదీన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్‌కు లేఖ రాశారు. చంద్రచూడ్ వెంటనే స్పందించారు. ఆయనను అభినందించాల్సిందే. కోల్ కతా ఉదంతాన్ని సుప్రీంకోర్టు తనంత తాను విచారణకు చేపట్టడానికి అంగీకరించినప్పుడు మిగత రెండు సంఘటనలపై అత్యున్నత న్యాయస్థానం ఎందుకు స్పందించలేదు అన్నది అసలు ప్రశ్న. ఎవరో ఫిర్యాదుచేస్తే తప్ప సుప్రీంకోర్టు స్పందించదా? దళిత అమ్మాయి, మూడేళ్ల బాలిక తరఫున మాట్లాడేవారు ఎవరూ లేకపోవడంవల్లే సుప్రీంకోర్టు ఈ కేసులను తనంత తాను విచారించడం లేదా? బీహార్‌లో అత్యాచారానికి గురైన దళిత అమ్మాయి తల్లిదండ్రులు రోజు కూలీలు. వారికి సుప్రీంకోర్టు మెట్లెక్కే అర్హతే కాదు పోలీసుస్టేషన్ మెట్లెక్కే శక్తి కూడా ఉండకపోవచ్చు. అంతమాత్రం చేత ఈ ఉదంతం జరిగినట్టు తెలిసిన తరవాత సమన్యాయం అందించవలసిన సుప్రీంకోర్టు స్పందించి ఉండాల్సింది కదా. ఇక మూడేళ్ల బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తి గుర్తు తెలియని వ్యక్తి కనక అతనికి శిక్ష పడే మార్గమే ఉండదా? ముజఫర్ పూర్ లో అత్యాచారానికి పాల్పడ్డారనుకుంటున్న ఆరుగురిలో ఒక వ్యక్తిపేరు సంజయ్ రాయ్ అని ఆ బాలిక తల్లి చెప్పింది. కోల్‌కతాలో దారుణానికి పాల్పడిన వ్యక్తి పేరు కూడా అదేనంటున్నారు. కోల్‌కత ఉదంతంలో నిందితుడనుకుంటున్న వ్యక్తిని మర్నాడే అరెస్టు చేశారు. ముజఫర్ పూర్ సంఘటనలో నిందితుడు పరారీలో ఉన్నాడట.
ఈ మూడు ఉదంతాల్లోనూ దోషులను గుర్తించాల్సిందే. చట్టం ముందు నిలబెట్టాల్సిందే. శిక్ష పడేట్టు చేయాల్సిందే. దళిత అమ్మాయి, మూడేళ్ల చిన్నారి తరఫున గొంతెత్తేవారు ఎవరూ లేకపోతే చట్టం కూడా మౌనంగా ఉండిపోవాలా! కోల్‌కతా సంఘటనకు రాజకీయ రంగు పులమడానికి బీజేపీ సకల ప్రయత్నాలూ చేస్తోంది. అక్కడ మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ ప్రభుత్వం ఉంది కనక, ఆ పార్టీ ప్రతిపక్ష కూటమిలో ఉంది కనక బీజేపీ నానాయాగీ చేస్తోంది. కోల్‌కతా సంఘటనకు నిరసనగా భారీ ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. దేశంలోని అనేక ప్రాంతాలలోనూ నిరసన కొనసాగుతూనే ఉంది. బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో జరిగిన కిరాతకంపై బీజేపీ నోరెత్తక పోవడానికి నితీశ్ కుమార్ ప్రభుత్వంలో ఇద్దరు బీజేపీ నాయకులు ఉపముఖ్యమంత్రులుగా ఉండడంవల్లే యాగీచేసే బీజేపీ నేతల నోళ్లకు తాళం పడిరదేమో! ఇది బీజేపీ రెండు నాలుకల ధోరణికి తిరుగులేని నిదర్శనం. అత్యాచారం ఉదంతాన్ని సాకుగా తీసుకుని మమతా బెనర్జీని అపఖ్యాతిపాలు చేయడానికి బీజేపీ సర్వ శక్తులూ ఒడ్డుతోంది. బెంగాల్ లో రాష్ట్రపతి పాలన విధించాలని కూడా వాదిస్తున్నారు. బీహార్, రాజస్థాన్ సంఘటనలపై మాత్రం పెదవి విప్పడం లేదు. బీహార్, రాజస్థాన్‌లో అత్యాచారానికి గురైన బాలికల కుటుంబాలను బీజేపీ నాయకులు పలకరించిన పాపాన కూడా పోలేదు. కనీసం మొసలి కన్నీళ్లైనా కార్చలేదు. నిజానికి ముజఫర్‌పూర్, జోధ్‌పూర్ సంఘటనల్లో బాధితుల కుటుంబాలకు మరింత అండ అవసరం. వారు తమ బిడ్డలకు జరిగిన అన్యాయాన్ని గొంతెత్తి చెప్పే అవకాశంఉన్న వారైనాకాదు. పోలీసులను, న్యాయస్థానాలను ఆశ్రయించే ఆర్థిక స్తోమత ఆ కుటుంబాల వారికి లేదు. ప్రభుత్వానికి మొర పెట్టుకునే తాహతూ లేదు. అత్యాచారాలలో తరతమ భేదాలు ఉండవు. కానీ బాధితులు అణగారిన వర్గాలకు చెందిన వారైనప్పుడు వారికే ఎక్కువ సహాయం అవసరం. సమాజం వారికి అండగా నిలవాలి. బీహార్, జోధ్‌పూర్ అత్యాచారాలను కనీసం ఆ రాష్ట్రాల హైకోర్టుల దృష్టికి తీసుకెళ్లే వారే కరువయ్యారు. సామాజిక కార్యకర్తలూ దిక్కులేని వారిని పట్టించుకోవాలనుకోక పోవడం విచిత్రమే. కోల్‌కతా హైకోర్టు గతంలో ఇలాంటి అనేక సందర్భాలలో సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది. సీబీఐ దర్యాప్తులో దోషులు ఎవరో తేల్చిన సందర్భాలే తక్కువ. కోల్ కతా సంఘటన జరిగి వారం దాటినా సీబీఐ దోషులను గుర్తించలేదు. ఈ హత్యాచారం వెనక ఆంతర్యం ఏమిటో కనిపెట్టలేక పోయింది. కోల్‌కతా ఉదంతంలో దర్యాప్తు వివరాలను తనకు రెండు గంటలకు ఒకసారి తెలియజేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హుకుం జారీ చేశారు. ఇందులో రాజకీయ కోణం దాచేసినా దాగని సత్యం.