లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఇటీవల మూడు రోజులపాటు అమెరికా పర్యటనకు వెళ్లక ముందు నుంచే అక్కడ ఆయన మోదీ మీద ఎన్ని విమర్శలు చేస్తారోనన్న ఊహాగానాలు మొదలైనాయి. అనుకున్నట్టుగానే గత సోమవారం వర్జీనీయాలో భారత సంతతి వారిని ఉద్దేశిస్తూ రాహుల్ అన్న మాటలు పెద్ద వివాదానికి దారి తీశాయి. భారత్‌లో ఏ మతం వారు… వారి మతాన్ని అనుసరించే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. ఈ విషయం స్పష్టం చేయడానికి ఆయన ఆ సభకు హాజరైన ఒక సిక్కును పేరు అడిగి భారత్‌లో మీరు స్వేచ్ఛగా మీ మతాన్ని అనుసరించే పరిస్థితి లేదు. మీరు పగిడీ కట్టుకోవడం, చేతికి కడా ధరించడం కూడా దుర్లభం అయ్యే పరిస్థితి ఉంది అన్నారు. గురుద్వారాకు వెళ్లే అవకాశమూ లేదు అన్నారు. రాహుల్ అన్న మాటలో అతిశయోక్తి ఉంటే ఉండొచ్చు. బహిరంగంగా మాట్లాడేటప్పుడు ఏ పార్టీకి చెందిన వారైనా జనాన్ని ఆకట్టుకోవడానికి ఇలాంటి శైలి అనుసరించడం మామూలే. దీన్ని బీజేపీ చాలా తీవ్రంగా పరిగణించింది. రాహుల్ గాంధీ ఇటీవల పార్లమెంటు లోపల, బయట చేస్తున్న విమర్శలను బీజేపీ నాయకులు ఏ మాత్రం భరించలేకపోతున్నారు. అమెరికాలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల మీద రాద్ధాంతం మొదలు పెట్టారు. కేంద్రమంత్రి రవణీత్ సింగ్ బిట్టూ నుంచి మొదలుకొని, రఘురాజ్ సింగ్, శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ నోటికి ఏ మాత్రం అదుపులేకుండా చేస్తున్న హెచ్చరికలు రాహుల్ గాంధీ ప్రాణానికి ముప్పు ఉందేమోనన్న అనుమానాలు కలిగిస్తున్నాయి. గైక్వాడ్… రాహుల్ నాలుక కోసిన వారికి రూ.11 లక్షలు బహూకరిస్తారట. బీజేపీ నాయకుడు తర్వీందర్ సింగ్ మార్వా అయితే రాహుల్ గాంధీకి కూడా వాళ్ల నాయనమ్మ ఇందిరా గాంధీకి పట్టిన గతే పడ్తుందని అన్నారు. రవణీత్ సింగ్ బిట్టు అయితే ఏకంగా రాహుల్ గాంధీ భయంకరమైన తీవ్రవాది అన్నారు. బిట్టూ మీద కాంగ్రెస్ కార్యకర్తలు దేశంలోని అనేక చోట్ల కేసులు నమోదు చేశారు. ఇది నిజానికి బీజేపీ నేర్పిన విద్యే. రాహుల్ గాంధీ మీద ఇప్పటికే పరువు నష్టం కేసులతో సహా అనేక రాష్ట్రాలలో బీజేపీ కేసులు దాఖలు చేసింది. గుజరాత్‌కు చెందిన దళిత నాయకుడు జిగ్నేశ్ మేవానీ మీద ఇలాగే అసోంలో కేసు దాఖలు చేస్తే… అసోం పోలీసులు హుటాహుటిన విమానాలు ఎక్కేసి గుజరాత్‌లో ఉన్న జిగ్నేశ్ మేవానీని అరెస్టు చేసి అసోం తీసుకెళ్లారు. ఆ వ్యవహారం ఇప్పటికీ తేలనే లేదు. రాహుల్ గాంధీ సిక్కులను ఉదాహరణగా చూపి మన దేశంలో మత స్వేచ్ఛకు బీజేపీ హయాంలో ఎలా విఘాతం కలుగుతోందో చెప్పే ప్రయత్నం చేశారు. కానీ సిక్కులను ఒక్క మాట కూడా అనలేదు. అయినా గుడ్డిగా ఆయన సిక్కులను అవమానించారని వక్రీకరించడానికి బీజేపీ వెనుకాడడం లేదు. ఒక బీజేపీ ఎమ్మెల్యే అయితే రాహుల్ గాంధీని హతమారుస్తామన్న దాకా వెళ్లారు. శాసనసభ్యులు, బీజేపీలో తగు మాత్రం పలుకుబడి ఉన్న నాయకులు, కడకు కేంద్ర మంత్రులు కూడా రాహుల్ గాంధీ మీద ఇలా తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం చూస్తే మోదీ ముస్లింల మీద పెంచి పోషించిన విద్వేషం రాహుల్ గాంధీ లాంటి నాయకులను తీవ్రంగా బెదిరించే స్థాయికి చేరుకుంది. కేంద్రమంత్రి రవణీత్ సింగ్ బిట్టు అయితే ఇటీవల బీజేపీ నాయకులు అనడం మానేసిన ‘‘పప్పు’’ అన్న పదాన్ని రాహుల్ మీద ప్రయోగించారు. చాలాకాలం నుంచి మోదీ మొదలుకుని బీజేపీ నాయకులు రాహుల్ ను ‘‘పప్పు’’ అని సంబోధించే వారు. పప్పు అంటే మూర్ఖుడు, పిల్ల చేష్టలు చేసే వాడు అన్న అర్థాలు ఉన్నాయి. అయితే భారత్ జోడో యాత్ర తరవాత రాహుల్‌లో రాజకీయ పరిణతి బాగా పెరిగింది. పార్లమెంటులో ఆయన ప్రసంగాలు దిగ్దంతలైన పార్లమెంటేరియన్లను గుర్తు చేస్తున్నాయి. మోదీని, ఆయన విధానాలను రాహుల్ తూర్పార పట్టడాన్ని బీజేపీ నేతలు భరించలేక పోతున్నారు. పార్లమెంటులో రాహుల్ గాంధీ ఎప్పుడు ప్రసంగించినా బీజేపీ సభ్యులు నినాదాలు చేస్తూ అడ్డు తగలడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆ సమయంలో ప్రధానమంత్రి మోదీ కానీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా గానీ తమ పార్లమెంటు సభ్యులను నియంత్రించే ప్రయత్నమైనా చేయలేదు. అంతే కాకుండా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాహుల్ ప్రసంగంలో ఎక్కుపెట్టిన విమర్శలు మోదీకి శూలాల్లా తగిలాయి. ఆ తీర్మానానికి సమాధానం ఇచ్చేటప్పుడు మోదీని పప్పు అనలేదు కానీ ఆ మాటకు అర్థం వివరణ ఇస్తున్నట్టుగా ‘‘బాలక్ బుద్ధి’’ అన్నారు. మోదీకన్నా ముందే రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యులుగా ఉన్నారు.
కేంద్ర మంత్రితో సహా బీజేపీ రాహుల్ మీద చేస్తున్న నిష్కారణ దాడిని ప్రశ్నిస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే ప్రధానమంత్రికి ఓ లేఖ రాశారు. ఈ లేఖకు సంబంధించి ఖడ్గేకు సమాధానం అయితే వచ్చింది. కానీ అది ప్రధానమంత్రి నుంచి కాదు. బీజేపీ అధ్యక్షుడు నడ్డా తగుదునమ్మా అని సమాధానం ఇచ్చి అదనపు ఆరోపణలు గుప్పించారు. నడ్డా ఇచ్చిన సమాధానం కెలికి జగడం పెట్టుకునేదిగా ఉంది తప్ప అత్యంత పెద్ద పార్టీకి అధ్యక్షుడైన వ్యక్తి చూపాల్సిన సంయమనం, మర్యాదా ఖడ్గేకు రాసిన లేఖలో లేవు. విధి లేక మీరు రాహుల్‌ను సమర్థిస్తున్నారు అని ఖడ్గే మీద కూడా అనుచిత విమర్శలు గుప్పించారు. రాహుల్‌ను జనం ఇప్పటికే అనేక సార్లు తిరస్కరించారు అని కూడా నడ్డా తన మూడు పేజీల లేఖలో రాశారు. కానీ ఈ సారి ప్రజలు బీజేపీని 303 స్థానాల నుంచి 240 స్థానాలకు కుదించిన వాస్తవాన్ని వాటంగా విస్మరించారు. రవణీత్ సింగ్ బిట్టూ మొన్నటిదాకా కాంగ్రెస్‌లో ఉన్నవారే. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. బీజేపీ అగ్రనాయకుల దృష్టిని ఆకర్షించడానికే ఆయన అడ్డూ అదుపు లేకుండా రాహుల్‌ను దూషించడానికి తెగబడ్తున్నారు. బిట్టు చేసిన విమర్శలు కేంద్రమంత్రి స్థాయిని పాతాళానికి చేర్చాయి. రాహుల్‌ను దుయ్యబట్టే క్రమంలో బిట్టూ నిజానికి సిక్కుల మీద విపరీతమైన దాడి చేశారు. ‘‘విమానాలను, రైళ్లను, రోడ్లను పేల్చేసే వారు రాహుల్‌కు మద్దతుదార్లు. అత్యంత భీకరమైన తీవ్రవాదిని పట్టుకున్న వారికి బహుమతి ఏదైనా ఉంటే రాహుల్‌ను పట్టుకున్న వారికి ఇవ్వాలి’’ అన్నారు. సాధారణ నాయకుల నుంచి బిట్టు లాంటి కేంద్ర మంత్రుల దాకా సంస్కార రహితంగా మాట్లాడడానికి కారణం ముస్లింలకు వ్యతిరేకంగా మోదీ ఎక్కించిన విద్వేషం. అది ఇప్పుడు ఎవరికి వ్యతిరేకంగానైనా వాడే ప్రమాదకర స్థాయికి చేరుకుంది. మోదీ తన అనుచరుల అనుచిత ప్రవర్తనను చూసి మందలించకపోవడం అంటే ఈ విద్వేష వమనానికి ఆయన మద్దతూ ఉందనే అనుకోవాలి. విద్వేషం ఈ స్థాయిలో విస్తరింప చేయడం అత్యంత హేయమైన రాజకీయం. మొత్తం సమాజానికి ప్రమాదకరం. ఈ విద్వేష వాతావరణం మారడానికి దశాబ్దాలు పడ్తుంది.