పలస్తీనియన్ జాతినే అంతం చేయాలన్న ఉద్దేశంతో గత ఏడాది అక్టోబర్ 8 తరవాత గాజా మీద అగ్నివర్షం కురిపించి వేలాది మందిని పొట్టన పెట్టుకున్న ఇజ్రాయిల్ ఇప్పుడు లెబనాన్ మీద యుద్ధం మొదలు పెట్టింది. మంగళవారం ఉదయం ఇజ్రాయిల్ సేనలు దక్షిణ లెబనాన్‌లోకి ప్రవేశించాయి. హెజ్బొల్లా మిలిటెంట్ల మీద ఇజ్రాయిల్ దళాలు తీవ్ర దాడి కొనసాగిస్తున్నాయి. గాజాను నుగ్గు నుగ్గు చేసిన తరవాత ఇజ్రాయిల్ హెజ్బొల్లా మిలిటెంట్లను తుదముట్టించే నెపంతో లెబనాన్ మీద దాడికి దిగింది. హెజ్బొల్లాకు ఇరాన్ మద్దతు ఉంది కనక ఎలాగైనా రెచ్చగొట్టి ఇరాన్‌ను కూడా యుద్ధానికి ప్రేరేపించాలన్నది ఇజ్రాయిల్ అసలు వ్యూహం. ఇప్పటికే ఇజ్రాయిల్ ఆగడాలు ఏడాదిగా ఆ ప్రాంతాన్నంతటినీ అతలాకుతలం చేశాయి. లెబనాన్ మీద దాడికి దిగడం గాజా మీద కొనసాగించిన దాడిని లెబనాన్‌కు విస్తరింప చేయడమే. ఇంతకాలం లెబనాన్‌లో ఉన్న హెజ్బొల్లాను సమర్థించిన ఇరాన్ కూడా ముగ్గులోకి లాగితే ఆ ప్రాంతమంతా నెత్తురుటేరులు పారక తప్పదు. అనేక దేశాల్లో తీవ్రవాదులు ఉండొచ్చు. తీవ్రవాదులను ప్రోత్సహించే దేశాలూ ఉండొచ్చు. కానీ ఒక దేశం, అక్కడి పాలకవర్గం తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడడం ఒక్క ఇజ్రాయిల్ విషయంలోనే కనిపిస్తుంది. నిస్సందేహంగా ఇజ్రాయిల్ తీవ్రవాద దేశం అని అరబ్బుల ప్రాంతంలో ఇజ్రాయిల్ అస్తిత్వంలోకి వచ్చిన దగ్గర నుంచి రుజువు అవుతూనే ఉంది. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరవాత బ్రిటన్, అమెరికా లాంటి దేశాలు యూదులకోసం పలస్తీనా సరసన కృత్రిమంగా ఒక దేశమే ఏర్పడేట్టు చేశాయి. అదే ఇజ్రాయిల్ దేశంగా అవతరించిన నాటి నుంచి పశ్చిమ దేశాలు, ప్రధానంగా అమెరికా ఇజ్రాయిల్‌కు పీకలదాకా ఆయుధాలు సరఫరాచేసి ఇజ్రాయిల్‌ను నరహంతక దేశంగా తయారుచేశాయి. అమెరికా అండతో ఇజ్రాయిల్ పెట్రేగిపోతోంది. ఇలా కయ్యానికి కాలు దువ్వడం ఇదే మొదటి సారి కాదు. ఇజ్రాయిల్ ఆగడాలవల్ల ఈ పరిస్థితి గత ఏడెనిమిది దశాబ్దాల కాలంగా ఎన్నోసార్లు తలెత్తింది. గతంలో 2006లో ఇజ్రాయిల్ హెజ్బొల్లాకు వ్యతిరేకంగా భూతలయుద్ధానికి పాల్పడిరది. దక్షిణ లెబనాన్‌లోని హెజ్బొల్లా దళాలపై పరిమితయుద్ధం కొనసాగిస్తున్నామని ఇజ్రాయిల్ చెప్పుకుంటున్నప్పటికీ ఇజ్రాయిల్ తత్వాన్ని గమనిస్తే అది పరిమిత యుద్ధంగా మిగలదు. ఆ సెగలు పొరుగున ఉన్న దేశాలనూ ఆవరిస్తాయి. పదిహేను రోజుల కిందటి నుంచే హిజ్బొల్లా మిలిటెంట్లు వాడే పేజర్లు, వాకీ టాకీలు పేలిపోయేట్టు ఇజ్రాయిల్ కుట్ర పన్నింది. ఇందులో వందలాది మంది హెజ్బొల్లా కార్యకర్తలు మరణించారు. ఆ తరవాత హెజ్బొల్లా నాయకుడు నస్రల్లాను, ఆ తరవాత మరో నాయకుడిని ఇజ్రాయిల్ హతమార్చింది. ఈ అఘాయిత్యాన్ని ప్రతిఘటించడానికి హెజ్బొల్లా సిద్ధపడడంలో ఆశ్చర్యకరమైంది ఏమీ లేదు. ఇజ్రాయిల్ చేసిన వైమానిక దాడుల్లో కూడా అనేకమంది హెజ్బొల్లా కమాండర్లు నేలకొరిగారు. ఈ దారుణాలన్ని చూస్తుంటే ఇజ్రాయిల్ కొనసాగిస్తున్నది యుద్ధం కాదు పనిగట్టుకుని మారణకాండకు పాల్పడుతోంది అని రుజువు అవుతోంది. యూదులను తప్ప తమ సరసన మరే జాతి వారికి అవకాశం లేకుండా చేయాలన్నది ఇజ్రాయిల్ పంతం.
హెజ్బొల్లా వెనక్కు తగ్గకుండా తమకు ఉన్న పరిమితుల్లో ఇజ్రాయిల్ ఆగడాలను ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తూనే ఉంది. ఇజ్రాయిల్ మీదికి రాకెట్లు, ఓ మోస్తరు క్షిపణులు ప్రయోగిస్తోంది. అయితే హెజ్బొల్లాకు వైమానిక దాడులు చేసే అవకాశం లేదు. 2006 నాటి యుద్ధం తరవాత ఆమోదించిన తీర్మానం ప్రకారం హెజ్బొల్లా దళాలు ఇజ్రాయిల్ సరిహద్దు నుంచి కనీసం 30 కి.మీ. వెనక్కు వెళ్లిపోవాలని ఇజ్రాయిల్ వాదిస్తోంది. కాని అనునిత్యం ఇజ్రాయిల్ కయ్యానికి దిగుతున్నప్పుడు హెజ్బొల్లా దళాలు వెనక్కు తగ్గాలనడం కేవలం వితండవాదమే. ఇచ్చిన మాటకు కట్టుబడే తత్వం ఇజ్రాయిల్‌కు లేనప్పుడు ఇతరులు ఆ పని చేయాలనడం వైపరీత్యమే. ఇజ్రాయిల్ దాడి తప్పదని గ్రహించిన లక్షలాది మంది లెబనాన్ పౌరులు కొద్ది వారాల కిందటి నుంచే తమ నివాసాలు వదిలి సురక్షితం అనుకున్న చోట్లకు తరలి పోయారు. కానీ అపారమైన ఆయుధ సంపత్తి, అన్నింటికన్నా మించి అగ్రరాజ్యమైన అమెరికా అండ ఉన్న ఇజ్రాయిల్ లోతట్టు ప్రాంతాలలో కూడా దాడి చేయదు అన్న హామీ ఎటూ లేదు. హెజ్బొల్లాకు వైమానిక శక్తి లేకపోవడంవల్ల ఇజ్రాయిల్ ఇష్టానుసారం దాడి చేయడం సులభం అవుతోంది. లెబనాన్‌లో ఇజ్రాయిల్ రక్త దాహం తీర్చుకోవడం కొత్తేమీ కాదు. పలస్తీనా మిలిటెంట్ల మీద దాడి పేరుతో 1978 లో లెబనాన్ మీద ఇజ్రాయిల్ దాడికి దిగింది. ఆ తరవాత 1982 లో మరోసారి దాడిచేసి దాదాపు దక్షిణ లెబనాన్‌ను ఆక్రమించింది. తమకు బద్ధ శత్రువు అనుకునే ఇరాన్‌ను ముగ్గులోకి లాగాలన్నదే ఇజ్రాయిల్ అసలు వ్యూహం. హౌతీ మిలిటెంట్ల మీద దాడి చేయడంలో భాగంగా గతంలో ఇజ్రాయిల్ యెమెన్ మీద వైమానిక దాడులు చేసింది. తమకు పశ్చిమాసియాలోని ఏ దేశం మీదైనా దాడి చేయగల సామర్థ్యం ఉందని ఇజ్రాయిల్ ప్రధానమంత్రి నెతన్యాహూ విర్రవీగుతూనే ఉన్నారు. లెబనాన్ మీద ఇజ్రాయిల్ మొదలు పెట్టిన కిరాతకం ఎన్నాళ్లు కొనసాగుతుందో తెలియదు. నిరాశ్రయులైన ఇజ్రాయిలీలు సురక్షితంగా స్వదేశం తిరిగి వచ్చే దాకా దాడులు కొనసాగుతాయని ఇజ్రాయిల్ బాహాటంగానే ప్రకటిస్తోంది. ఇజ్రాయిల్ కసి హెజ్బొల్లా మీదే కావచ్చు కానీ లెబనాన్‌కు కూడా అపార నష్టం అనివార్యం. ఇరాన్ మీద దాడి చేయాలని ఇజ్రాయిల్ అనేక ఏళ్ల నుంచి అమెరికాను ప్రేరేపిస్తోంది. అదే జరిగితే ఇప్పటికే పశ్చిమాసియాలో ఇజ్రాయిల్‌కు మద్దతుగా ఉన్న అమెరికా దళాల సంఖ్య భారీగా పెరగడం అనివార్యం. యుద్ధం నివారించాలని ఇరాన్ కోరుకోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఇజ్రాయిల్ దగ్గర అణ్వస్త్రాలున్నాయి. నెతన్యాహూ లాంటి యుద్ధ పిపాసి ఇజ్రాయిల్ అధిపతిగా ఉన్నప్పుడు అణ్వస్త్రాలు వినియోగించకూడదన్న నియమానికి కట్టుబడి ఉంటాడన్న పూచీ లేదు. ఒక వేళ ఇజ్రాయిల్ ఆ దుస్సాహసానికే దిగితే 1945 తరవాత అణ్వస్త్ర ప్రయోగం ఇదే మొదటి సారి అవుతుంది. ఇజ్రాయిల్ ఎంతకైనా తెగిస్తుందని ఇరాన్‌కు తెలుసు కనక తమ అత్యున్నత నాయకుడు అయతుల్లా అలీ ఖామేనీని సురక్షిత ప్రాంతానికి తరలించింది. ఇరాన్ యుద్ధ రంగంలోకి దిగడం అనివార్యమైన పరిస్థితి ఎదురైతే లక్షలాది మంది ప్రాణాలు బలైపోవడం ఖాయం. దీనికి పూర్తి బాధ్యత ఇజ్రాయిల్‌ను వెనకేసుకొస్తున్న అమెరికా, బ్రిటన్ దేశాల మీదే ఉంటుంది. అన్నింటికన్నా మించి ఏదో ఒక మూల యుద్ధం జరిగితేనే అమెరికా ఆయుధ వ్యాపారం వృద్ధి చెందుతుంది. ఆయుధ బేహారులకు మానవత్వం ఉండదు అని రెండవ ప్రపంచ యుద్ధం తరవాత అనేక సార్లు రుజువైంది. తీవ్రవాద దేశమైన ఇజ్రాయిల్ అమెరికా చేతిలో పావు మాత్రమే. ఇజ్రాయిల్‌కు ఉన్న జాతి వివక్ష మరింత ఆజ్యం పోయడానికి దోహదం చేస్తోంది.