ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టొరేట్(ఇ.డి.), పి.ఎం.ఎల్.ఎ. (ద్రవ్య అక్రమ చెలామణి నిరోధక చట్టం) లాంటి వాటి పేర్లు జనానికి అంతగా పరిచయం లేనప్పుడు సీబీఐ పెద్ద భూతంగా కనిపించేది. సీబీఐని పంజరంలో పక్షి అని ఎప్పుడూ ఈసడిస్తూనే ఉంటారు. ఇ.డి., పి.ఎం.ఎల్.ఎ. ఇప్పుడు పెద్ద భూతాల్లాగా కనిపిస్తున్నాయి. ఇవి బ్రహ్మ రాక్షసులతో సమానం. ఆదాయం పన్ను శాఖలో అంతర్భాగమైన ఇ.డి. మోదీ హయాంలో ఆదాయపు పన్ను శాఖకన్నా ఎక్కువ ప్రచారంలో ఉంది. నిజానికి అపఖ్యాతి పాలైపోయింది. వివిధ హైకోర్టులు, ముఖ్యంగా సుప్రీంకోర్టు ఇ.డి. పనితీరుపై అనేక సందర్భాలలో చాలా తీవ్రమైన ప్రతికూల వ్యాఖ్యలు చేశాయి. ప్రతిపక్ష నాయకులను వేధించడానికి ఇ.డి., పి.ఎం.ఎల్.ఎ. మోదీ ప్రభుత్వానికి బ్రహ్మాస్త్రాల్లా పనికి వస్తున్నాయి. ఈ రెండూ దుర్వినియోగం అయినట్టుగా మరేవీ దుర్వినియోగం అవుతున్నట్టు లేదు. తాజాగా పంజాబ్, హర్యానా కోర్టు ఇ.డి. వ్యవహారసరళిని తీవ్రంగా దుయ్యబట్టింది. సురేంద్ర సింగ్ పన్వర్ హర్యానాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఆయన మీద ద్రవ్య అక్రమ రవాణా కేసు మోపారు. అదీ ఏదో గనుల తవ్వకం కేసులోనట. గనుల తవ్వకానికి పి.ఎం.ఎల్.ఎ.కు సంబంధం ఏమిటి అని పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తి మహావీర్ సింగ్ సింధు ఇ.డి. తరఫున వాదిస్తున్న న్యాయవాదులను నిలదీశారు. నిరాధార ఆరోపణలపై ఎవరినైనా దీర్ఘకాలంపాటు జైలులో ఉంచే హక్కు మీకు ఎవరిచ్చారు అని న్యాయమూర్తి సింధు ఇ.డి.ని ప్రశ్నించారు. పన్వర్‌ను విడుదల కూడా చేశారు. పన్వర్ 68 రోజుల పాటు జైలులో ఉండాల్సి వచ్చింది. ఆయన గత ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిని భారీ ఓట్ల తేడాతో ఓడిరచారు. ఇప్పుడు కూడా సోనీపత్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అందుకే ఆయనను జులై 20న అరెస్టు చేసి ఉంటారన్న వాదనలు బలంగా ఉన్నాయి. ఏ కేసులోనైనా, ఎవరిమీద అయినా దర్యాప్తు చేయడానికి హేతుబద్ధమైన సమయం తీసుకోవాలి కనక దర్యాప్తు ముందుకు సాగనివ్వకుండా, విచారణ ఊసే లేకుండా దీర్ఘ కాలం జైలులో మగ్గపెట్టడం కుదరదని న్యాయమూర్తి సింధు గట్టిగా మందలించారు. పన్వర్‌ను అరెస్టు చేయడానికి ముందు 14 గంటల 40 నిముషాల పాటు విరామం లేకుండా ఇ.డి. అధికారులు ప్రశ్నలతో వేధించారు. దీన్ని కూడా పంజాబ్, హర్యానా హైకోర్టు తప్పు పట్టింది. గంటలు, రోజుల తరబడి ఎవరినైనా ప్రశ్నించడం వీరోచిత కార్యక్రమం ఏమీ కాదని హైకోర్టు దెప్పి పొడిచింది. పన్వర్ ద్రవ్య అక్రమ వినియోగానికి పాల్పడ్డారని చెప్పడానికి కనీస ఆధారమైనా లేదని హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అలాంటప్పుడు విడుదల చేయడం తప్ప హైకోర్టుకు మరో మార్గం ఏముంటుంది కనక! ఆరోపణలు మోపి దర్యాప్తు పేరిట నిరవధికంగా ఎవరినైనా జైలులో ఎలా ఉంచుతారు అని ఇ.డి.ని హైకోర్టు ప్రశ్నించింది. పి.ఎం.ఎల్.ఎ. కింద నిందితుడిగా పన్వర్‌ను గుర్తించడానికి అనువుగా ఏ దాఖలా కనిపించడం లేదని హైకోర్టు చేసిన వ్యాఖ్య ఇ.డి.కి చెంపపెట్టు లాంటిదే. పన్వర్ అరెస్టుకు జారీ చేసిన ఉత్తర్వు, అరెస్టు చేయడానికి చూపిన కారణాలు కూడా చట్టం ప్రకారం ఏ రకంగానూ సమర్థించడానికి వీలులేనివి అని న్యాయమూర్తి వ్యాఖ్యానించడం ఇ.డి.కి ఎంత అవమానకరమో చెప్పడమూ కుదిరే పని కాదు.
హైకోర్టులు, ప్రధానంగా సుప్రీంకోర్టు ఇ.డి.వ్యవహరిస్తున్న తీరును అనేక సందర్భాలలో తప్పు పట్టాయి. డబ్బు అక్రమ చెలామణి చట్టం కింద ఇ.డి. ఇష్టానుసారం అరెస్టు చేయడానికి వీలు లేదని సుప్రీంకోర్టు గతంలో కూడా తీవ్ర స్వరంతోనే చెప్పినా ఇ.డి. ధోరణి మారలేదు. ఎవరిని అరెస్టు చేసినా అది హేతుబద్ధంగానే కాకుండా చట్టబద్ధంగా కూడా ఉండాలని, అరెస్టు చేయడానికి తగిన సాక్ష్యాధారాలు ఉండాలని సుప్రీంకోర్టు పదే పదే చెప్పినా ఇ.డి. చెవికెక్కించుకోవడం లేదు. గత జులై 12వ తేదీన న్యాయమూర్తులు సంజీవ్ ఖనా, దీపాంకర్ దత్తాతో కూడిన బెంచి పి.ఎం.ఎల్.ఎ. చట్టంలోని సెక్షన్ 19 (1) కింద అరెస్టు చేయడానికి ఇ.డి.కి ఉన్న అధికారాన్ని రాజ్యాంగం ప్రకారం పౌరులకున్న జీవిచే హక్కును కాల రాయడానికి వీలు లేదని అన్నా ఇ.డి.తీరు మారలేదు. ఇలా చేయడం రాజ్యాంగం లోని 21 వ అధికరణాన్ని ఖాతరు చేయకపోవడమేనని కూడా న్యాయమూర్తులు తీవ్రంగా వ్యాఖ్యానించారు. పి.ఎం.ఎల్.ఎ. కింద అరెస్టు చేస్తే న్యాయమూర్తులు బెయిలు మంజూరు చేయడం కూడా కష్టమేనన్న వాదనా బలంగానే ఉంది. కానీ ఒక్క దిల్లీ మద్యం విధాన కేసునే తీసుకున్నా మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్‌తో సహా ఇటీవల దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు కూడా న్యాయస్థానాలు బెయిలు మంజూరు చేశాయి. అయితే పి.ఎం.ఎల్.ఎ. చాలా కఠినమైందన్న భావన కొందరు, ముఖ్యంగా కింది స్థాయి న్యాయమూర్తుల మదిలో గూడుకట్టుకు పోయినట్టుంది. బెయిలు హక్కు, తప్పని సరి అయితేనే జైలు అని సుప్రీంకోర్టు ఎన్నిసార్లు గుర్తు చేసినా కింది కోర్టులే కాక కొన్ని హైకోర్టులు బెయిలు మంజూరు చేయడానికి హేతుబద్ధమైన నిర్ణయం తీసుకోవడానికి జంకుతున్నాయి. ఇ.డి. దూకుడు గురించి వివిధ స్థాయుల్లోని కోర్టులు మొదలుకొని సుప్రీంకోర్టు దాకా ఎంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసినా ఇ.డి.ఆగడాలు తగ్గడం లేదు. ఇ.డి.కి ఉన్న ‘‘హద్దు లేని అధికారాల’’ను కట్టడి చేయడానికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే కూడా అభ్యర్థించవలసి వచ్చింది. సుప్రీంకోర్టు ఇ.డి.ని నియంత్రించడానికి చర్య తీసుకోకపోతే ఈ దేశంలో ఎవరికీ భద్రత ఉండదని సాల్వే ఆందోళన వ్యక్తం చేయవలసి వచ్చింది. ఎడా పెడా అరెస్టు చేయడంలో ఇ.డి.చూపే అత్యుత్సాహం అరెస్టు చేసిన వారి మీద మోపిన ఆరోపణలను రుజువు చేయడంలో కనిపించదు. ఇంతవరకు వందలాది మందిని డబ్బు అక్రమ చెలామణి పేరుతో జైళ్లల్లోకి తోసినా దర్యాప్తు కొలిక్కి వచ్చిందీ లేదు. విచారణ మొదలైన సందర్భాలూ తక్కువే. విచారణ పూర్తి అయి ఇ.డి.ఆరోపణలు రుజువై శిక్షలు పడ్డ సందర్భాలు వేళ్ల మీద లెక్కించగలిగినన్ని మాత్రమే ఉన్నాయి. ఇ.డి.ఎంత విశృంఖలంగా ప్రవర్తిస్తుందో చూడాలంటే తాజాగా సురేంద్ర పన్వర్ కేసునే తీసుకోవచ్చు. గనుల తవ్వకానికి, డబ్బు అక్రమ చెలామణికి సంబంధం ఏమిటి అని పంజాబ్ హైకోర్టు నిలదీయడంలోనే ఇ.డి.అడ్డదిడ్డ వ్యవహారం బయట పడ్తోంది. లేని కంపెనీ నుంచి పన్వర్ లబ్ధి పొందారన్నది ఇ.డి.ఆరోపణ. ఆ కంపెనీ అస్తిత్వంలో ఉన్నట్టు కూడా ఇ.డి. నిరూపించలేక పోయింది. ఇ.డి. మీద న్యాయస్థానాలు ప్రతికూల వ్యాఖ్యలు చేయడం జరుగుతున్న అవకతవకలకు నిదర్శనం అని సంతృప్తి పడడానికీ వీలు లేదు. ఈ వ్యాఖ్యల పర్యవసానం ఏమిటో ఇప్పటిదాకా కనిపించలేదు. అలాంటప్పుడు కేవలం వ్యాఖ్యల వల్ల ప్రయోజనం ఉండదు. న్యాయ స్థానాలు మరో అడుగు ముందుకు వేసి ఇ.డి. ఆటకట్టించాలి.