దాదాపు రెండు నెలల పాటు ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించి జూన్ నాలుగున ఫలితాలు వెల్లడిరచిన తరవాత కూడా ఫలితాలపై అనుమానాలు తీరడం లేదు. ఎన్నికలకు ముందు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు(ఇ.వి.ఎం.) వివాదాస్పదమైనాయి. ఇ.వి.ఎం.ల మీద అనేక ఏళ్ల నుంచి అనేక మంది నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. వాటిని ఏకపక్షంగా ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా వినియోగించుకునే అవకాశం లేదని ఎన్నికల కమిషన్ చెప్తున్నా జనంలో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయడానికి చేసిందేమీ లేదు. అంటే ఎన్నికల సమయంలో అన్ని పక్షాలకు సమాన అవకాశాలు కల్పించే బాధ్యతను రాజీవ్ కుమార్ నాయకత్వంలోని ఎన్నికల కమిషన్ నిర్వర్తించనే లేదు. ఎన్నికలకన్నా ముందు ఆయన నిర్వహించిన విలేకరుల సమావేశంలో లేవనెత్తిన ప్రశ్నలకు నికరమైన సమాధానాలు ఇవ్వకుండా కవిత్వం చదవడం ప్రారంభించారు. ఆయన కవితాత్మ జనం అనుమానాలను ఏ మాత్రం తీర్చలేకపోయింది. ఓట్ ఫర్ డెమోక్రసీ, అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రైట్స్ ఎన్నికలకు ముందు, ఎన్నికల తరవాత కూడా ప్రశ్నలు లేవనెత్తుతూనే ఉంది. ఇ.వి.ఎం.లు లేకపోతే మోదీ ఎన్నికల్లో విజయం సాధించలేరు అని రాహుల్ గాంధీ అనేక ఎన్నికల ప్రచార సభల్లో ఆరోపించారు. కొత్త పార్లమెంటు ఏర్పడిన తరవాత కూడా సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అఖిలేశ్ యాదవ్ నిండు లోకసభలోనే ఎన్నికలకు ముందు, తరవాత కూడా తనకు ఇ.వి.ఎం.ల మీద నమ్మకంలేదని కరాఖండీగా చెప్పారు. ఉత్తరప్రదేశ్ లోని మొత్తం 80 సీట్లు తమ పార్టీనే గెలిచినా తాను ఈ ఓటింగ్ యంత్రాలను నమ్మను అని అఖిలేశ్ యాదవ్ అన్నారు. ఇ.వి.ఎం.ల పని తీరును, వాటిని మార్చడానికి అవకాశం లేదని నిరూపించడానికి ప్రతిపక్షాలు ప్రతిపాదించే నిపుణుల ముందు రుజువు చేయాలని ప్రతిపక్షాలు కోరినా ఎన్నికల కమిషన్ స్పందించలేదు. ఇ.వి.ఎం.ల పై రగడ ఇప్పుడప్పుడే సమసి పోయేట్టు లేదు. కొన్ని చోట్ల పోలైన ఓట్ల కన్నా లెక్కకు వచ్చిన ఓట్లు తక్కువగా ఉంటే మరి కొన్ని చోట్ల పోలైన ఓట్ల కన్నా ఎక్కువ ఓట్లు లెక్కకు వచ్చాయి. అంటే ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడానికి అధికార పక్షం పన్నిన కుట్రలకు ఎన్నికల కమిషన్ పూర్తి మద్దతు ఉందనుకోవాలి. యంత్రాలు అబద్ధం ఆడవు అనుకుంటే మరి ఈ లెక్కల్లో తేడా ఎందుకు వచ్చినట్టు. దీని మీద ఎన్నికల కమిషన్ పెదవి విప్పక పోవడంలో ఆంతర్యం ఏమిటి? 176 సీట్లలో పోలైన ఓట్ల కన్నా ఎక్కువ 35,000 ఓట్లు లెక్కలోకి వచ్చాయి. మొత్తం మీద 15 రాష్ట్రాలలోని 79 నియోజక వర్గాలలో ఏదో మాయ జరిగింది. ఈ మాయ జరగడమే నిజమై ఉంటే ‘‘ఇండియా’’ ఐక్యసంఘటనలోని పక్షాలు బీజేపీకన్నా ఎక్కువ సీట్లు సంపాదించేవి అన్న వాదన నిరాధారంగా మిగలదు. ఈ 79 స్థానాలను బీజేపీ సాధించిన 240 సీట్ల నుంచి తీసేస్తే కేవలం 161 సీట్ల దగ్గరే చతికిలపడేది. ఓటు వేయడానికే ఇ.వి.ఎం.లు ఉపకరిస్తాయి కానీ ఆ ఓట్లు నమోదయ్యేది వి.వి.పాట్లలో. ఈ రెండిరటి అంకెల మధ్య తేడా ఉందంటే ఎక్కడో మోసం జరుగుతోందనే అనుకోవాలి. ఈ సారి ఇ.వి.ఎం. ల పనితీరుమీద మాత్రమే ఫిర్యాదులు రాలేదు. ఓట్ల లెక్కింపులో ఎన్నికల కమిషన్ మాయ ఇ.వి.ఎం.ల వల్ల జరుగుతుందనుకునే నష్టం కన్నా ఎక్కువ. మొత్తం 538 సీట్లలో పోలైన ఓట్లకు లెక్కించిన ఓట్లకు మధ్య తేడా ఉందని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫామ్స్ నిరంతరం వాదిస్తోనే ఉంది. 362 సీట్లలో పోలైన ఓట్ల కన్నా లెక్కించిన ఓట్లు 5.5 లక్షలు తక్కువ కావడం పచ్చి మోసమేగా! మరి కొన్ని చోట్ల ఈ పరిస్థితి తిరగబడి పోలైన ఓట్ల కన్నా లెక్కించిన ఓట్లు ఎక్కువైనాయి. సగటున 3000 ఓట్ల తేడా ప్రతి నియోజకవర్గంలోనూ ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. లక్షలాది ఓటర్లు ఉండే లోకసభ నియోజక వర్గంలో గెలిచినవారు సాధించిన ఓట్లకు, ఓడిన వారికి వచ్చిన ఓట్ల మధ్య తేడా హాస్యాస్పదంగా ఉంది. ఉదాహరణకు వాయవ్య ముంబై నియోజకవర్గంలో గెలిచిన అభ్యర్థికి కేవలం 48 ఓట్లే ఎక్కువ వచ్చాయి. ఫరూఖాబాద్ లో కూడా సమీప ప్రత్యర్థుల మధ్య తేడా చాలా స్వల్పం.
ఎన్నికల క్రమంలో ప్రతిపక్షాలు ఎన్ని ఫిర్యాదులు చేసినా ఎన్నికల కమిషన్ పట్టించుకోలేదు. సాక్షాత్తు మోదీ మీద ఫిర్యాదుచేస్తే కనీసం ఆయనకు నోటీసు ఇచ్చే ధైర్యం కూడా ఎన్నికల కమిషన్‌కు లేకుండా పోయింది. ఆయన పార్టీకి నోటీసు జారీచేసి చేతులు దులుపుకుంది. అదే ఫిర్యాదు అందిందే తడవుగా ప్రతిపక్ష పార్టీలకు నోటీసులమీద నోటీసులు గుప్పించారు. సాధారణంగా పోలింగ్ సమయం ముగిసిన తరవాత కొద్ది గంటల్లో ఎన్నికల కమిషన్ ఇంత శాతం ఓట్లు పోలయ్యాయని గణాంకాలు విడుదల చేస్తుంది. ఆ మర్నాటికి నికరమైన లెక్కలు ప్రకటిస్తుంది. ఆ తరవాత తేడాలకు ఆస్కారం ఉండకూడదు. కానీ ఈసారి ఏడు దశల పోలింగ్ వివరాలు ప్రకటించడానికి ఎన్నికల కమిషన్ చాలా ఎక్కువ సమయం తీసుకుంది. పైగా ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్ నుంచి కొంత సమాచారం తీసేశారు. దీనికి కారణం ఏమిటో ఎన్నికల కమిషన్ చెప్పనే లేదు. పోలింగ్ శాతంలో అంకెలు మారిపోవడం, నికరమైన అంకెల ప్రకటనలో విపరీతమైన జాప్యం, ఒక నియోజకవర్గంలో పోలైన ఓట్లకు, అదే నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాలలో పోలైన ఓట్లకు మధ్య పొంతన లేకపోవడం ఇంతకు మునుపెన్నడూ వినని విచిత్రమే. ఎన్నికల కమిషన్ ప్రకటించిన తాత్కాలిక అంకెలకు నికరమైన అంకెలకు మధ్య 4.65 కోట్ల ఓట్ల తేడా ఉంటే నమ్మకం ఎలా కుదురుతుంది. ఒరిసాలో 10, మహారాష్ట్రలో 11, పశ్చిమ బెంగాల్ లో 10, ఆంధ్రప్రదేశ్ లో 7, కర్నాటకలో 6, చత్తీస్‌గఢ్‌లో, రాజస్థాన్‌లో అయిదేసి, బీహార్, మధ్యప్రదేశ్, తెలంగాణలో మూడేసి, అస్సాం లో 2, అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్, కేరళలో ఒక్కో స్థానంలో తాత్కాలిక అంచనాలకు, నికరమైన లెక్కలకు మధ్య తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఒరిస్సాలో బీజేపీ విజయానికి, ఆంధ్ర ప్రదేశ్‌లో తెలుగుదేశం, ప్రజారాజ్యం, బీజేపీ కూటమి అమోఘమైన విజయం సాధించడంలో ఎన్నికల కమిషన్ మాయ ఏమైనా ఉందేమోనన్న అనుమానాలు నిరాధారం కాకపోవచ్చు. బీజేపీ కేరళలో ఒక సీటు సంపాదించడంలోనూ మతలబు ఉందేమో! ముగ్గురు ఎన్నికల కమిషనర్ల నియామక కమిటీలోంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తప్పించడంలోనూ మతలబు ఉండే ఉంటుంది. లేకపోతే అన్ని నియోజక వర్గాలలో 3.2 శాతం నుంచి 6.32 శాతం దాకా ఎక్కువ ఓట్లు ఇ.వి.ఎం.లు పొదగడంవల్ల వచ్చినవి కావుగా. ఒరిశా4లో ఈ తేడా 12.4 శాతం అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఇది 12. 54 శాతం అన్నది గమనించి తీరవలసిన అంశమే. మొత్తం మీద మాయ కేవలం ఇ.వి.ఎం.లకు పరిమితమైంది కాదు. అంతకంటే అతీతమైంది.