జమ్మూ-కశ్మీర్, హర్యానా శాసనసభల ఎన్నికల తేదీలను ఎన్నికల కమిషన్ శుక్రవారం ప్రకటించింది. ఈ ఎన్నికల ప్రక్రియ సెప్టెంబర్ 18న మొదలై అక్టోబర్ ఒకటో తేదీతో ముగుస్తుంది. జమ్మూ-కశ్మీర్ శాసనసభకు మూడు విడతల్లో పోలింగ్ జరుగుతుంది. హర్యానాలో మాత్రం ఒకే విడత అక్టోబర్ ఒకటిన పోలింగ్ జరుగుతుంది. జమ్మూ-కశ్మీర్ లో మొదటి దశ పోలింగ్ సెప్టెంబర్ 18న, రెండో దశ సెప్టెంబర్ 25న, మూడో దశ అక్టోబర్ 1న జరుగుతుంది. జమ్మూ-కశ్మీర్‌లో పదేళ్ల తరవాత శాసనసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ విడత ఎన్నికలు నిర్వహించేది రెండే రాష్ట్రాలు అయినప్పుడు జమ్మూ-కశ్మీర్‌లో మూడు విడతల్లో పోలింగ్ నిర్వహించడంలో ఆంతర్యం ఏమిటో అంతుపట్టదు. కేంద్ర ప్రభుత్వం చెప్తున్నదాన్నిబట్టి అక్కడ అంతా సుఖశాంతులే వెల్లివిరుస్తున్నాయి. తీవ్రవాదం తోక ముడిచిందంటున్నారు. రెండు రాష్ట్రాలలో ఒకే విడత ఎన్నికలు నిర్వహించడానికి కావలసిన బందోబస్తు ఏర్పాటు చేయడానికి భద్రతా సిబ్బంది కొరత ఉందన్న వాదనను అంగీకరించలేం. సెప్టెంబర్ 30వ తేదీలోగా జమ్మూ-కశ్మీర్ శాసనసభ ఎన్నికలు పూర్తి కావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జమ్మూ-కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370వ అధికరణాన్ని రద్దు చేయడాన్ని, జమ్మూ-కశ్మీర్‌కు ఉన్న రాష్ట్ర పతిపత్తిని లాగేయడాన్ని సుప్రీంకోర్టు ఆక్షేపించలేదన్న వస్తవాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. 2019 ఆగస్టు అయిదున జమ్మూ-కశ్మీర్ కు వర్తించే 370వ అధికరణాన్ని రద్దు చేయడమే కాక జమ్మూను, కశ్మీర్‌ను, లదాక్‌ను మూడు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడదీశారు. జమ్మూ-కశ్మీర్ కు ఉన్న రాష్ట్ర ప్రతిపత్తిని త్వరలోనే పునరుద్ధరిస్తామని కూడా మోదీ ప్రభుత్వం అప్పుడు వాగ్దానం చేసింది. అన్న అవకాశం అయిదేళ్లయినా రానే లేదు. ఎన్నికలు ప్రకటించిన జమ్మూ-కశ్మీర్, హర్యానా తో పాటు మహారాష్ట్ర శాసనసభకు కూడా ఎన్నికలు నిర్వహించవలసి ఉన్నా ఎన్నికల కమిషన్ మహారాష్ట్ర ఎన్నికలను ప్రస్తుతానికి నిర్వహించడం లేదు. నిజానికి హర్యానా, మహారాష్ట్ర శాసనసభల గడువు దాదాపు ఒకేసారి ముగుస్తుంది. హర్యానా శాసనసభ గడువు నవంబర్ మూడున ముగుస్తుంది. మహారాష్ట్ర శాసనసభ గడువు నవంబర్ 26న ముగుస్తుంది. అయినా హర్యానా శాసనసభకు నవంబర్ మూడున కొత్త శాసనసభ ఏర్పడేలా కాకుండా రెండు నెలలకు పైగా ముందుకు లాగారు. అదేసూత్రం మహారాష్ట్రకు ఎందుకు వర్తింప చేయలేదో తెలియదు. అదేమంటే ఎన్నికల కార్యక్రమాన్ని ఎన్నికల కమిషన్ నిర్ధారిస్తుంది అంటారు. కానీ ఎన్నికల కమిషన్‌కు మోదీ హయాంలో అంత స్వేచ్ఛ ఎక్కడుంది కనక! అంతా మోదీ చెప్పినట్టే జరగుతుంది. అంటే మహారాష్ట్రలో మిగతా రెండు శాసనసభలతో పాటే ఎన్నికలు నిర్వహించడం బీజేపీకి అనుకూలం కాదని మోదీ, ఆయన నాయకత్వంలోని బీజేపీ భావించినట్టుంది. జమ్మూ-కశ్మీర్‌లో ఇటీవల సార్వత్రిక ఎన్నికల సమయంలో లోక్‌సభ స్థానాలకు కూడా ఎన్నికలు జరిగాయి. జమ్మూ ప్రాంతంలో బీజేపీ రెండు స్థానాలు సంపాదించింది. మరో స్థానంలో స్వతంత్ర అభర్థి గెలిచారు. కశ్మీర్ లోయలోని స్థానాలకు పోటీచేసే సాహసమే బీజేపీకి లేకుండా పోయింది. ఉత్తర ప్రదేశ్‌లో పది శాసనసభా స్థానాలకు ఉప ఎన్నికలు జరగవలసి ఉంది. కానీ ఆ ఎన్నికల కార్యక్రమాన్ని ఇంకా ప్రకటించలేదు.
ఒకే దేశం-ఒకే ఎన్నికలు అని అవకాశం వచ్చినప్పుడల్లా నినదించే మోదీ ప్రభుత్వం మూడు రాష్ట్రాల శాసనసభలకు ఏకకాలంలో ఎందుకు ఎదుర్కోలేకపోతోందో తెలియదు. ఇది మోదీ మాటలకు, చేతలకు ఉండే సహజ వ్యత్యాసమే అనుకోవాలి. హర్యానాలో ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వమే ఉంది. కానీ ఎన్నికలు జరిగితే అక్కడ బీజేపీ అధికారం కోల్పోవచ్చునన్న అంచనాలు ఉన్నాయి. అక్కడ కాంగ్రెస్ బలపడిరదంటున్నారు. జమ్మూ-కశ్మీర్ లో బీజేపీ అదృష్టం పరీక్షించుకోవలసిందే. జమ్మూలో పరిస్థితి బీజేపీకి కొంత అనుకూల పరిస్థితి ఉండొచ్చు. కశ్మీర్ లో మాత్రం ఎదురుదెబ్బ తప్పకపోవచ్చు. మహారాష్ట్రలో ప్రస్తుతం అజిత్ పవార్ నాయకత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్‌తో కలిసి బీజేపీ అధికారంలో ఉన్నారు. అజిత్ పవార్ నేషనలిస్టు కాంగ్రెస్ వర్గానికన్నా బీజేపీకి ఉన్న శాసనసభ్యుల సంఖ్యే ఎక్కువ. కానీ కాంగ్రెస్, శరద్‌పవర్ నాయకత్వంలోని నేషనలిస్టు కాంగ్రెస్, శివసేన, ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చేసింది. శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్‌ను బీజేపీ నిలువునా చీల్చేసింది. ప్రాంతీయ పార్టీల అస్తిత్వాన్ని అంతం చేయడానికి ముందు వాటిని చీల్చడం బీజేపీ నిరంతరం అనుసరించే ప్రక్రియ. అందులో భాగంగానే దేవేంద్ర ఫడ్నవిస్ నాయకత్వంలోని బీజేపీకి అధిక స్థానాలున్నా తక్కువ స్థానాలున్న అజిత్ పవార్‌ను ముఖ్యమంత్రిని చేసింది. ఫడ్నవిస్ ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకున్నారు. అజిత్ పవార్ నాయకత్వంలోని నేషనలిస్టు కాంగ్రెస్ అసలైన నేషనలిస్టు కాంగ్రెస్ అని ఎన్నికల కమిషన్ నిర్ధారించింది. కానీ జనబలం మాత్రం శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకే ఉన్నట్టు లోక్‌సభ ఎన్నికలతోపాటు అనేక సందర్భాలలో తేలిపోయింది. లోక్‌సభ ఎన్నికలలో అజిత్ పవార్ భార్యే ఘోరంగా ఓడిపోయారు. ఈ ఎదురు దెబ్బలను భరించి నిలదొక్కుకోగలన్న ఆత్మస్థైర్యం అజిత్ పవార్‌కు లోపించినట్టు అనేక సంఘటనలు రుజువు చేస్తున్నాయి. మళ్లీ శరద్ పవార్ పంచన చేరితే తప్ప తనకు, తన చీలిక వర్గానికి అస్తిత్వం ఉండదు అన్న భయం ఆయనను పీడిస్తోంది. అజిత్ పవార్ వర్గంలోని సీనియర్ నాయకులు కొందరు అవకాశం వచ్చినప్పుడు శరద్ పవార్ నాయకత్వంలోని పార్టీలో దూకే అవకాశాలు మెండుగా ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికలలో తన భార్యనే గెలిపించుకోలేనని అజిత్ పవార్‌ను భయం పీడిస్తోంది. తన భార్య చేత, పెదనాన్న కూతురిపై తన భార్యను పోటీ పెట్టకుండా ఉండవలసిందని అజిత్ పవార్‌కు ఆలస్యంగా జ్ఞానోదయం అయింది. అందుకే ఆ మధ్య శరద్ పవార్ ను కలుసుకున్నారు. తనతోపాటు గోడ దూకి వచ్చినవారు ఎన్నికల సమయం వచ్చే సరికి ఒక్కుమ్మడిగా పక్షుల్లా లేచిపోయి శరద్ పవార్ గూట్లో వాలితే అజిత్ పవార్ కు మిగిలేది ఏమీ ఉండదు. ఆ స్థితిలో అజిత్ పార్టీకి అస్తిత్వమే లేకుండా చేయడానికి బీజేపీ చేయగలిగినదంతా చేస్తుంది. ఇలాంటి లెక్కలన్నీ తేలాల్సి ఉన్నాయి. ఈ లోగా ప్రధానమంత్రి మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మహారాష్ట్రలో అనేకసార్లు వాలి పోవాలి కదా! దానికి మరింత సమయం కావాలి కాబట్టే మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలను మిగతా రెండు శాసనసభ ఎన్నికలతో పాటు నిర్వహించడంలేదు. ఎన్నికల కమిషన్ మోదీ చేతిలో ఉన్నంత కాలం ఇలాంటి ఎత్తుగడలన్నీ కష్టం కాదు.